శాస్త్రీయ గాయకుడు పండిత్ జస్రాజ్ కన్నుమూత

భారతీయ శాస్త్రీయ గాయకుడు పండిత్ జస్రాజ్ (90)అనారోగ్యంతో చికిత్స పొందుతూ సోమవారం కన్నుమూశారు. జస్రాజ్ 75 ఏండ్ల పాటు తన సంగీతంతో అలరించారు. ఆయన కేవలం 14 సంవత్సరాల వయస్సులో గాయకుడిగా శిక్షణ పొందడం ప్రారంభించి, ప్రతిరోజూ 14 గంటలు పాటు సంగీతం నేర్చుకునేవారు. 

ఈయనకు మన దేశంలోనే కాక విదేశాల్లో కూడా ఎంతో మంది శిశ్యులున్నారు. ఆయన దగ్గర సంగీతం నేర్చుకున్న చాలా మంది ఉన్నత స్థానాల్లో ఉన్నారు. బాలీవుడ్ ప్రముఖ సంగీత ద్వయం జతిన్ లలిత్ ఈయన కుమారులే. ప్రముఖ నటి గాయని సులక్షణ పండిత్, విజేత పండిత్ ఈయన కూతుళ్లే. జస్రాజ్‌ పెద్దన్నయ్య పండిత్ మణిరామ్ కూడా ప్రముఖ సంగీత విధ్వాంసుడే.  

తన తండ్రి పండిట్‌ మోతీరామ్‌ తన తొలి గురువు కావడంతో జస్రాజ్‌ ఏటా ఆయన జ్ఞాపకార్ధం హైదరాబాద్‌లో గత 30 ఏళ్లుగా పండిట్‌ మోతీరామ్‌ సంగీత్‌ సమారోహ్‌ను నిర్వహిస్తున్నారు. ప్రముఖ బాలీవుడ్‌ గాయని సాధనా సర్గమ్‌తో పాటు సంజీవ్‌ అభయంకర్‌, సుమన్‌ ఘోష్‌, తృప్తి ముఖర్జీ, కళా రామ్‌నాథ్‌ల వంటి ఎందరినో ఆయన గాయకులుగా తీర్చిదిద్దారు. భారత సంగీత దిగ్గజం ఇక లేరని ఆయన కుమార్తె దుర్గా జస్రాజ్‌ ప్రకటించారు.

సంగీతంలో ఎన్నో అద్భుతాలు సృష్టించిన పండిత్ జస్రాజ్‌కు కేంద్రం పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ బిరుదులతో సత్కరించింది. దీంతో పాటు వివిధ రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వివిధ పురస్కారాలు అందుకున్నారు. ఆయన  మృతితో హిందుస్థానీ సంగీతంలో ఓ శకం ముగిసిందనే చెప్పాలి. 

మ్యూజిక్ లెజెండ్ పండిట్ జస్‌రాజ్ మృతి తనను విషాదంలో ముంచెత్తిందని రాష్ట్రపతి తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. 8 దశాబ్దాలకు పైగా అత్యద్భుతమైన కెరీర్ సాగించి సంగీత సామ్రాజాన్ని సుసంపన్నం చేసిన పద్మ విభూషణుడు జస్‌రాజ్ అని గుర్తుచేసుకున్నారు. జస్‌రాజ్ కుటుంబ సభ్యులకు, అభిమానులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

ఆయన మృతికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ సంతాపం వ్యక్తం చేశారు. ‘జస్రాజ్ గారి సంగీత కూర్పు అద్భుతం. చాలా మంది వోకలిస్ట్‌లకు మెంటార్‌‌గా ఆయన సేవలు అసాధారణం. జస్రాజ్ కుటుంబ సభ్యులతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఆయనను అభిమానించే వారికి సంతాపం వ్యక్తం చేస్తున్నా. ఓం శాంతి’ అని మోడీ ట్వీట్ చేశారు.