ఏపీలో ఫోన్ ట్యాపింగ్ పై దుమారం

ఏపీలో ఫోన్ ట్యాపింగ్ పై దుమారం
ఆంధ్రప్రదేశ్ లో  ఫోన్ ట్యాపింగ్ వివాదం దుమారం రేపుతోంది. ఈ అంశంపై హైకోర్టు విచారణ ఈనెల 20కి వాయిదా పడింది. ఫోన్ ట్యాపింగ్ అంశంపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం పతాక స్థాయికి చేరిన  నేపధ్యంలో ఏపీ  హైకోర్టు ఇవాళ విచారణ చేపట్టింది.
 
 ఫోన్ ట్యాపింగ్‌పై విచారణకు ఆదేశిస్తే ఇబ్బందేమిటని ప్రభుత్వాన్ని ధర్మాసనం ప్రశ్నించింది.  ఈ విషయమై  అఫిడవిట్‌లో ఉన్న కథనాన్ని చదివి వినిపించాలని హైకోర్టు కోరింది. కథనంలో ఏముందో అడిగి తెలుసుకుంది. 
 
ఐదుగురు న్యాయమూర్తుల ఫోన్లు ట్యాపింగ్‌కు గురయ్యాయని, ఒక పోలీస్ అధికారిని  అందుకోసం ప్రత్యేకంగా నియమించారని కోర్టుకు న్యాయవాది శ్రవణ్ విన్నవించారు. ఆ అధికారి ఎవరో చెప్పాలని, ఆధారాలు చూపాలని ధర్మాసనం అడగగా  తాను అధికారి పేరుతో అఫిడవిట్ దాఖలు చేస్తానని న్యాయవాది చెప్పారు. 
 
రాజకీయ నాయకుల మాదిరిగా న్యాయమూర్తులకు కూడా షాడో పార్టీలను నియమించారని శ్రవణ్ కోర్టుకు తెలిపారు. అన్ని వివరాలతో అఫిడవిట్‌ను ఫైల్ చేయాలని శ్రవణ్‌ను ధర్మాసనం ఆదేశించింది. ఎవరి ఫోన్ ట్యాపింగ్ చేసినా అది చిన్న విషయం కాదని.. దర్యాప్తుకు ఆదేశిస్తే అసలు విషయాలు బయటపడతాయి కదా అని హైకోర్టు వ్యాఖ్యానించింది. 
 
దీనిపై ఏమైనా అభ్యంతరం ఉందా అని ప్రభుత్వం తరపున న్యాయవాదిని హైకోర్టు ప్రశ్నించింది. ప్రభుత్వం తరపున అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించిన ధర్మాసనం.. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేస్తూ, ఆరోజే నిర్ణయం తీసుకుంటామని తెలిపింది.  ఈ విషయంలో కౌంటర్‌ దాఖలు చేయాలని సర్వీస్‌ ప్రొవైడర్లకు హైకోర్టు నోటీసులు ఇచ్చింది.