కరోనాలో  దూసుకుపోతున్న ట్రాక్టర్ అమ్మకాలు 

కరోనా వైరస్ వాహన విక్రయాలు కుదేలైనప్పటికీ ట్రాక్టర్ల అమ్మకాలు మాత్రం భారీగా పుంజుకుంటున్నాయి. దేశవ్యాప్తంగా అంచనాలకుమించి వర్షాలు కురియడం, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలకోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించడంతో ట్రాక్టర్లకు ఎనలేని డిమాండ్ తెచ్చిపెట్టింది.

వాహన అమ్మకాలు పడిపోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పలు ఆటోమొబైల్ సంస్థలకు ట్రాక్టర్ల రూపంలో కొంత ఊరట లభిస్తున్నది. ద్వి చక్ర వాహనాలు, కార్లు, కమర్షియల్ వాహన విక్రయాల్లో ప్రతికూల వృద్ధిని నమోదు చేసుకోగా అదే ట్రాక్టర్లు మాత్రం రెండంకెల వృద్ధిని కనబరిచినట్లు ఫాడా వెల్లడించింది. 

గత నెలలో దేశవ్యాప్తంగా 76,197 ట్రాక్టర్ల విక్రయాలు జరిగాయి. క్రితం ఏడాది ఇదే నెలలో అమ్ముడైన 55,522తో పోలిస్తే 37.24 శాతం అధికంగా జరిగాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు పెద్దపీట వేయడం కూడా ట్రాక్టర్ల విక్రయాలకు కలిసొచ్చింది. ముఖ్యంగా పలు రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ రుణాలను మాఫీ చేయడంతో గ్రామీణ రోడ్లపై ట్రాక్టర్లు దూసుకుపోతున్నాయి. 

గతంలో సగటున ఊరికి ఒక్క ట్రాక్టర్ ఉండగ .ప్రస్తుతం ఇంచుమించు ఇంటికొకటి తయారైంది. కరోనాతో అన్ని రంగాలు కుదేలైనప్పటికీ  వ్యవసాయ రంగంపై ఎలాంటి ప్రభావం పడలేదు. ట్రాక్టర్ల తయారీలో అగ్రగామి సంస్థయైన మహీంద్రా అమ్మకాలు 38 శాతం వరకు పెరగడంతో మార్కెట్ వాటా 24 శాతానికి ఎగబాకింది.