ఢిల్లీలో చైనా వ్యక్తి బడా మనీలాండరింగ్

వందల కోట్ల రూపాయల మనీలాండరింగ్ జరుపుతున్నాడన్న ఆరోపణలపై చైనాకు చెందిన ఒక వ్యక్తిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. చార్లీ పెంగ్ పేరుతో మజ్నూ మట్టిదిబ్బల ప్రాంతంలో నివసిస్తూ టిబెటన్ లామాస్ కు డబ్బు చెల్లించి దలైలామా గురించి ఆరా తీస్తున్నట్లు గుర్తించారు. ఈ వ్యక్తిని గత ఐదు రోజుల క్రితం మనీలాండరింగ్ ఆరోపణలపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు అరెస్టు చేశారు. అతను చైనా నిఘా వర్గాల ప్రతినిధి అయిఉండొచ్చని భావిస్తున్నారు.

ఇలాఉండగా, ఇదే వ్యక్తి 2018 లో గూఢచర్యం కేసులో అరెస్ట్ అయి, ప్రస్తుతం బెయిల్ పై ఉన్నట్లు నిఘావర్గాలు తేల్చాయి. లువో సాంగ్ అసలు పేరు కాగా చార్లీ పెంగ్ పేరుతో ఢిల్లీలో నివసిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. మజ్నూ కా తిలలో నివసిస్తూ టిబెట్ ఆధ్యాత్మిక గురువు దలైలామా గురించి సమాచారం తెలుసుకునేందుకు చాలా మందికి రెండు, మూడు లక్షల రూపాయలు ఇచ్చినట్లు పోలీసులు తేల్చారు. 

2014లో లువో సాంగ్ నేపాల్ ద్వారా భారతదేశంలోకి ప్రవేశించినట్లు తేలింది. మిజోరాంలో ఒక అమ్మాయిని వివాహం చేసుకున్నారు. అక్కడ ఉన్న సమయంలో నకిలీ పాస్‌పోర్ట్ సిద్ధం చేసుకున్నాడు. మరో పేరుతో ఆధార్, పాన్ కార్డు కూడా తీసుకున్నాడు. తన సహచరులతో చైనీస్ యాప్ వీ చాట్‌లో చాట్ చేసేవాడని పోలీసులు తెలిపారు.

ఢిల్లీకి చెందిన చార్టర్డ్ అకౌంటెంట్‌ను కూడా ఆదాయపు పన్ను శాఖ గుర్తించింది. అతను మనీలాండరింగ్‌లో సాంగ్‌కు సహాయం చేస్తున్నాడు. ఈయనను ఇంకా అరెస్టు చేయలేదు. ఇంకా విచారణ జరుపుతున్నట్లు తెలిసింది. 

అతను 40 కి పైగా బ్యాంకు ఖాతాలను కలిగివున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ బ్యాంకు ఖాతాల ద్వారా రూ.300 కోట్ల వరకు లావాదేవీలు జరిగాయని అధికారులు చెప్తున్నారు. హాంకాంగ్ ద్వారా లావాదేవీలు జరిగాయని, దీనిలో కొంతమంది బ్యాంకు ఉద్యోగులు చేయి ఉండొచ్చని ఆదాయపు పన్ను శాఖ అధికారులు అనుమానిస్తున్నారు.

చిన్న చైనా కంపెనీలకు పెద్ద చైనా కంపెనీలు నకిలీ కొనుగోలు ఉత్తర్వులు జారీ చేస్తున్నట్లు ఐటీ విభాగం కనుగొన్నది. గత వారం ఢిల్లీ, ఎన్‌సీఆర్ ప్రాంతంలో ఐటీ దాడులు జరిగాయి. ఈ సమయంలో లువో సాంగ్ తో పాటు ఇతర చైనా పౌరులు చైనీస్ షెల్ కంపెనీల పేరిట 40 ఖాతాలను తెరిచి రూ.వెయ్యి కోట్లకు పైగా మనీలాండరింగ్ చేసినట్లు ఆదాయపు పన్ను శాఖ కనుగొన్నది.