ఏపీలో పలు పట్టాణాల్లో ప్రైవేటు ఆస్పత్రుల్లో కోవిడ్ చికిత్సకు అనుమతులు ఇవ్వడం వెనుక అధికార పార్టీకి చెందిన రాజకీయ నేతల ఒత్తిడి ఉందనేది తెలుస్తున్నది. అధికారులపై మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు ఉన్నతాధికారుల వేధింపులు పెరిగిపోతున్నాయి. ప్రైవేటు ఆస్పత్రుల్లో బెడ్లు ఇప్పించాలని అధికారులపై వత్తిడి తేవడంతోనే అనుమతులు ఇస్తున్నట్లు తెలుస్తున్నది.
ఫలానా ఆస్పత్రిలో అనుమతులు లేవంటే వెంటనే వాటికి ఇప్పించండి నేను చూసుకుంటాననే హూంకరింపులతో జిల్లాస్థాయి అధికారులు దిగిరాక తప్పడం లేదు. ఇటీవల స్వర్ణా ప్యాలెస్‌లో అగ్ని ప్రమాద ఘటన అనంతరం ఈ అంశాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.
పైకి ప్రభుత్వ ఆస్పత్రి నయం అక్కడే చికిత్స తీసుకోండని చెబుతున్న ఫ్రభుత్వ అధికారులుగానీ, ప్రజాప్రతినిధులుగానీ ఎవరూ ప్రభుత్వాస్పత్రికి చికిత్స కోసం వెళ్లడం లేదు. డిప్యూటీ స్పీకర్ ఒక్కరే ప్రభుత్వ నిర్వహణలో ఉన్న ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రిలో చేరారు. అది కూడా ప్రత్యేక చికిత్స అందించారు.
దీనికితోడు ప్రభుత్వాస్పత్రుల్లో చేరినా సరిపోయినంతమంది వైద్యులు లేకపోవడంతో పరిస్థితి తీవ్ర రూపం దాల్చింది. ఉన్న వైద్యులూ విజిట్ చేయడం, చికిత్స మొత్తం కిందస్థాయి జూనియర్ డాక్టర్లు చేస్తుండటంతో ఎక్కువమంది అక్కడకు వచ్చేందుకు సిద్ధపడటం లేదు. దీంతో ఎక్కువ జిల్లాల్లో అధికారులు ఎక్కడికక్కడ అనుమతులు మంజూరు చేశారు. అవే ఇప్పుడు ప్రభుత్వానికి చుట్టుకున్నాయి.
కరోనా చికిత్స కోసం కేర్ సెంటర్లు ఏర్పాటు చేయాలంటే ఐసిఎంఆర్ కొన్ని నిబంధనలు రూపొందించింది. దాని ఆధారంగా రాష్ట్రంలో విధివిధానాలు ప్రకటించారు. ఏప్రిల్ నెలలో విదేశాల నుండి వచ్చేవారి కోసం విశాఖ, విజయవాడ, రాజమండ్రి, ఏలూరు, చిత్తూరు, తిరుపతి, కడప, కర్నూలు, అనంతపురం వంటి పట్టణాల్లో కోవిడ్ సెంటర్లుగా హోటళ్లను ఏర్పాటు చేశారు.
ఒకవైపు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆస్పత్రుల్లో వైద్యులు తగిన సంఖ్యలో లేకపోవడం, ఒత్తిడులు పెరగడంతో నిబంధనలు పరిశీలించి అనుమతులు మంజూరు చేశారు. అనంతరం ఫలానా ఆస్పత్రిలో బెడ్లు కావాలని జిల్లా స్థాయి అధికారులకు రోజుకు కనీసం పదిమందికిపైగా ప్రజాప్రతినిధుల నుండి రికమండేషన్లు రావడంతో ఒత్తిడి పెరిగిపోయింది.
అయినప్పటికీ అనుమతుల విషయంలో జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే రాజకీయ ప్రతినిధుల అండదండలతో ప్రైవేటు ఆస్పత్రులు అనుమతులు ఉన్నా లేకపోయినా ఎక్కడికక్కడ కేర్ సెంటర్లను పెట్టేసుకున్నాయి. బెడ్లు కావాలనే ఒత్తిడిలో అధికారులు కూడా ఏమీ అనలేని పరిస్థితి నెలకొంది.
మరోవంక ఆగస్టులో కరోనా కేసులు పెరుగుతాయని ఓ నిపుణుల కమిటీ హెచ్చరించినా అధికార యంత్రాంగం స్పందించక పోవడంతో ఏపీలో కరోనా తీవ్రత అధికామవుతున్నట్లు భావిస్తున్నారు. రాష్ట్రంలో ఏడు జిల్లాల్లో కేసులు అధికంగా పెరిగే అవకాశం ఉందని కమిటీ ముందే చెప్పింది. కమిటీ చెప్పిన స్థాయిలో కాకపోయినా గతంతో పోల్చుకుంటే రాష్ట్రంలో కరోనా ఉధృతి పెరిగింది.
ప్రైమరీ కాంటాక్ట్స్‌ను గుర్తించడంలో అధికారులు అలసత్వం ప్రదర్శించడం, టెస్టులు చేసినా నాలుగైదు రోజుల వరకూ ఫలితాలు రాకపోవడంతో కేసులు పెరుగుతున్నాయి. మరో పక్క మరణాలు కూడా పెరుగుతున్నాయి. సీరియస్‌గా ఉన్న వారిని ఆస్పత్రుల్లో చేర్చుకోవడంతో జాప్యం కారణంగా సకాలంలో వైద్యం అందక చాలా మంది మృత్యువాతపడుతున్నారు.
More Stories
రతన్ టాటా మృతి పట్ల ఆర్ఎస్ఎస్ సంతాపం
ఆలయాల సొమ్ము సగం రేవంత్ ప్రభుత్వ ఖజానాకే
పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా కన్నుమూత