కరోనా సోకితే ఆ వైరస్ కు కాకుండా చికిత్స ఖర్చుకు భయపడాల్సిన పరిస్థితి ఇప్పుడు తెలంగాణలో నెలకొంది. లక్షల రూపాయల నగదు కడితే గాని ప్రైవేట్ ఆసుపత్రులలో చేర్చుకోవడం లేదు. ఆరోగ్య భీమా పాలసీలు ఉన్నోళ్లు కూడా ఇందుకు మినహాయింపు కాదు. ‘నో ఇన్సూరెన్స్’ అని ముందే చెప్పేస్తున్నారు.
హాస్పిటల్‌లో చేరితే రోజుకు రూ 50 వేల నుంచి రూ.లక్ష పైనే ఖర్చవుతుందని కూడా చెప్పేస్తున్నారు. దాంతో రూ.వేలు కట్టి ప్రీమియంలు చెల్లించి బీమా తీసుకున్నా ప్రయోజనం లేకుండా పోతోందని జనం ఆవేదన చెందుతున్నారు.
ఆరోగ్య బీమాను ఆమోదించాలని, లేకుంటే చర్యలు తీసుకుంటామని ఐఆర్‌డీఏఐ (ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అధారిటీ ఆఫ్ ఇండియా) హెచ్చరించినా పట్టించుకోవడం లేదు. ఆరోగ్య భీమాలను అంగీకరించడం లేదని కొందరు రోగుల బంధువులు ట్విట్టర్ ద్వారా ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తున్నా అటు నుంచి కనీస స్పందన లేదు.
దేశంలో ఆరోగ్య భీమా కంపెనీలు 30 వరకు ఉన్నాయి. ఇవన్నీ తెలంగాణలో కూడా పాలసీలు చేయిస్తుంటాయి. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆరోగ్య భీమా తీసుకోని వాళ్ల కోసం ‘కొవిడ్ ప్యాకేజీలు’ తయారు చేయాలని అన్ని కంపెనీలను ఐఆర్‌డీఏఐ ఆదేశించింది.
దీంతో చాలా కంపెనీలు పాలసీలతో ముందుకు వచ్చాయి. కరోనా కవచ్ పేరుతో రూ.లక్ష నుంచి ఐదు లక్షల వరకు ప్యాకేజీలు తయారు చేశాయి. మూడున్నర, ఆరున్నర, తొ మ్మిదిన్నర నెలల పీరియడ్‌తో రూ.వెయ్యి, 2 వేల ప్రీమి యంతోనే రూ.2 లక్షల నుంచి ఐదు లక్షల ప్యాకేజీలు తయారుచేశాయి. తక్కువమొత్తం కావడంతో చాలా మంది ఈ పాలసీలు తీసుకుంటున్నారు.
కొన్ని కంపెనీలు పాత పాలసీలకే అదనంగా కొంత ప్రీమియం చార్జ్‌చేసి అందులో కొవిడ్‌ను చేర్చాయి. మరికొన్ని కంపెనీలు పాత పాలసీలకే చికిత్స ఇచ్చేందుకు ఒప్పుకుంటున్నాయి. కానీ హాస్పిటళ్లు ఎట్లాంటి బీమాను ఆమోదించడం లేదు.
పైగా ప్రభుత్వ ఆసుపత్రులలోకన్నా ప్రైవేట్ ఆసుపత్రిలలో ఎక్కువమంది కరోనా రోగులు ఉన్నట్లు వైద్యశాఖ ప్రకటనలు తెలుపుతున్నాయి. ఆదివారం నాటి బులెటిన్ ప్రకారం ప్రభుత్వ దవాఖాన్లలో 2,616 మంది చికిత్స తీసుకుంఉండగా, ప్రైవేట్ ఆసుపత్రులలో 4,446 మంది చికిత్స పొందుతున్నారు.
More Stories
ప్రధాని ఆర్దిక సలహా మండలి ఛైర్మన్ వివేక్ దేవరాయ్ మృతి
ఈ దీపావళికి చైనాకు రూ.1.25 లక్షల కోట్ల నష్టం
19 భారతీయ సంస్థలు, ఇద్దరు భారతీయులపై అమెరికా ఆంక్షలు