కరోనా వ్యాప్తి కారణంగా మొహర్రం, గణేశ్ చతుర్థిని ప్రజలు ఇళ్లలోనే జరుపుకోవాలని, ఎలాంటి ఊరేగింపులు, విగ్రహ సంస్థాపనలు చేయొద్దని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ స్పష్టం చేశారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం.. రద్దీ ప్రదేశాల్లో గణేశ్ విగ్రహాలు పెట్టడానికి, వేడుకలు నిర్వహించడానికి అనుమతి లేదని స్పష్టం చేశారు.
‘మేం మీ ఆరోగ్యం, సంరక్షణ గురించి శ్రద్ధ వహిస్తాం. కరోనా నుంచి మీ కుటుంబాలను కాపాడుకోండి. మొహర్రం మాత్రం మీ ఇళ్లలోనే జరుపుకోండి. అలాగే, అందరూ గణేశ్ పూజలనూ ఇళ్లలోనే జరుపుకోవాలి. ప్రభుత్వ సూచనల ప్రకారం విగ్రహ సంస్థాపనలు, పబ్లిక్ ప్రదేశాలలో ఎలాంటి ఉత్సవాల నిర్వహణకు గానీ అనుమతి లేదు. మీతోపాటు నగరాన్ని సురక్షితంగా ఉంచండి’ అని అంజనీ కుమార్ పేర్కొన్నారు.
కరోనా వ్యాప్తి నేపథ్యంలో వినాయకచవితి, మొహర్రం పండుగలను ఇంట్లోనే నిర్వహించుకోవాలని అటవీ, పర్యావరణ, దేవాదాయశాఖల మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి నిన్న ప్రకటించారు. గణపతి ఉత్సవాలను, మొహర్రం పండుగను నిరాడంబరంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు.
కొవిడ్–19 నిబంధనలు పాటిస్తూ పక్కవారికి ఇబ్బంది కలుగకుండా, ఎక్కువ జనం గుమిగూడకుండా పండుగలను ఎవరింట్లో వాళ్లే జరుపుకోవాలని, సామూహిక నిమజ్జనాలు, ప్రార్థనలు వద్దని సూచించారు. కరోనా బారిన పడకుండా ఉండేందుకు పండుగలు, ఉత్సవాల సమయంలో ప్రజలు నిబంధనలు పాటిస్తూ ప్రభుత్వానికి సహకరించాలని మంత్రి విజ్ఞప్తిచేశారు.
More Stories
ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జనం పూర్తి
ఒకవైపు ప్రజాపాలన దినోత్సవాలు.. మరోవైపు విముక్తి దినోత్సవాలు
రికార్డు స్థాయిలో బాలాపూర్ లడ్డుకు రూ 30 లక్షల ధర