చైనా విస్తరణవాదాన్ని ఎండగట్టిన రాష్ట్రపతి 

డెబ్బై నాలుగవ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ శుభాకాంక్షలు తెలుపుతూ చైనా విస్తరణవాదాన్ని పరోక్షంగా ఎండగట్టారు.   యావత్ ప్రపంచం తమ ముందున్న అతిపెద్ద సవాలును (కోవిడ్ మహమ్మారి) ఎదుర్కొంటుండగా, మరో వైపు మన పొరుగుదేశం విస్తరణవాదంతో దుస్సాహసం చేస్తోందని ధ్వజమెత్తారు.

దేశ ప్రజలను ఉద్దేశించి శుక్రవారం సాయంత్రం రాష్ట్రపతి ప్రసంగిస్తూ  గల్వాన్‌లో అమరులైన సైనికులకు జాతి సెల్యూట్‌ చేస్తోందని చెప్పారు. ప్రత్యర్ధుల దూకుడుకు దీటుగా బదులిస్తామని గల్వాన్‌లో మన సైనికుల ధైర్యసాహసాలు సుస్పష్టం చేశాయని కొనియాడారు. 

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల వేళ మనం స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకోవాలని చెబుతూ వారి త్యాగాల ఫలితంగానే మనం స్వేచ్ఛావాయువులు పీలుస్తున్నామని చెప్పారు. 

కోవిడ్ మహమ్మారితో తలెత్తే సవాళ్లను కేంద్ర ప్రభుత్వం ముందుగానే గుర్తించి సమర్ధవంతంగా ఎదుర్కొందని రాష్ట్రపతి ప్రశంసించారు. సకాలంలో తీసుకున్న సమర్ధవంతమైన చర్యల వల్ల కోవిడ్ తీవ్రతను నిరోధించడం, పెద్ద సంఖ్యలో ప్రజల విలువైన ప్రాణాలను కాపాడటంలో భారత్ విజయవంతమైందని  సంతోషం వ్యక్తం చేశారు.

కరోనా మహమ్మారితో ప్రపంచమంతా పోరాడుతోందని, ఈ వ్యాధితో ముందుండి పోరాడుతున్న యోధులకు దేశం రుణపడిఉందని తెలిపారు. కోవిడ్‌-19తో ప్రజల జీవనస్ధితిగతులు మారిపోయాయని చెప్పారు. ఈ విపత్కర పరిస్ధితుల్లో కేంద్రం పలు పధకాల ద్వారా ప్రజలకు సాయం చేసిందని పేర్కొన్నారు. 

రాష్ట్ర ప్రభుత్వాలు సకాలంలో స్పందించి స్ధానిక పరిస్ధితులకు అనుగుణంగా చర్యలు చేపట్టడంతో కరోనా ప్రభావాన్ని కొంతమేర కట్టడి చేయగలిగామని చెప్పారు. వందేభారత్‌ మిషన్‌ ద్వారా విదేశాల్లో చిక్కుకున్న పది లక్షల మంది స్వదేశానికి చేరకున్నారని తెలిపారు. ప్రజారోగ్యానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తూ మెరుగైన మార్పులకు శ్రీకారం చుడుతోందని చెప్పుకొచ్చారు.