వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వెంబడి నిలిచిపోయిన దళాల ఉపసంహరణ ప్రక్రియను పూర్తి చేయడానికి కలిసి రావాలని చైనాకు భారత్ పిలుపు ఇచ్చింది. సరిహద్దుల్లో పరిస్థితులపైనే భవిష్యత్తులో ఇరు దేశాల మధ్య సంబంధాలు ఆధారపడి ఉంటాయని స్పష్టం చేసింది.
వాస్తవాధీన రేఖ వెంబడి భారత భూభాగాలను ఖాళీ చేసేందుకు చైనా నిరాసక్తత వ్యక్తం చేస్తోందని వార్తలు వస్తున్న సమయంలో, భారత దేశ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిథి అనురాగ్ శ్రీవాస్తవ భారత దేశ వైఖరిని వివరించారు. దళాల ఉపసంహరణ ప్రక్రియను పూర్తి చేయడానికి భారత్‌తో కలిసి రావాలని చైనాను కోరారు.
ప్రస్తుతం అమల్లో ఉన్న ఒప్పందాలు, ప్రోటోకాల్స్‌కు అనుగుణంగా దళాల ఉపసంహరణ ప్రక్రియను పూర్తి చేయడం కోసం ఇరు దేశాలు చాలా సమావేశాలు నిర్వహించాయి. కానీ పాంగాంగ్ సరస్సు డెప్సాంగ్ వంటి ఫ్రిక్షన్ పాయింట్ల వద్ద చైనా దళాల ఉపసంహరణ నిలిచిపోయింది.
వారానికోసారి నిర్వహించే మీడియా సమావేశంలో శ్రీవాస్తవ మాట్లాడుతూ, పూర్తి స్థాయిలో దళాల ఉపసంహరణ లక్ష్యం దిశగా నిజాయితీగా పని చేసేందుకు చైనా మాతో కలిసి వస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.
ప్రత్యేక ప్రతినిధులు అంగీకరించిన సరిహద్దు ప్రాంతాల్లో శాంతి, ప్రశాంతత పూర్తిగా పునరుద్ధరణ జరిగేందుకు, ఉద్రిక్తతలు తగ్గేందుకు కలిసి రావాలని కోరారు. ద్వైపాక్షిక సంబంధాల అభివృద్ధికి ఇది చాలా అవసరమని స్పష్టం చేశారు.
More Stories
మోదీ, అమిత్ షా ల ఎఐ ఫోటోలు వాడిన ఆప్ పై కేసు
కేరళ, తమిళనాడు తీరాలకు కల్లక్కడల్ ముప్పు
హైడ్రోజన్ రైలును పరిచయం చేసిన భారత్