బీఎస్ఎఫ్‌కు దేశీయ గ్రెనేడ్ లాంఛర్లు 

దేశీయంగా తయారు చేసిన గ్రెనేడ్ లాంఛర్లను సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్)కు పంపినట్లు పుణేలోని ఆయుధాల కర్మాగారం ప్రకటించింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన ‘ఆత్మ నిర్భర్ భారత్’ పథకానికి స్పందించి వీటిని తయారు చేసినట్లు తెలిపింది.   

పుణేలోని ఖడ్కీలో ఉన్న అమ్యునిషన్ ఫ్యాక్టరీ బుధవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపిన వివరాల ప్రకారం, 40ఎంఎం అండర్ బ్యారెల్ గ్రెనేడ్ లాంఛర్ (యూబీజీఎల్) తొలి కన్‌సైన్‌మెంట్‌ను బీఎస్ఎఫ్‌కు ఈ కర్మాగారం పంపించింది. 

నాగ్‌పూర్‌లోని రక్షణ శాఖ ప్రజా సంబంధాల అధికారి ఓ ట్వీట్ ద్వారా ఈ వివరాలు తెలిపారు. 40ఎంఎం అండర్ బ్యారెల్ గ్రెనేడ్ లాంఛర్ తొలి కన్‌సైన్‌మెంట్‌ను బీఎస్ఎఫ్‌కు ఈ నెల 11న పంపినట్లు తెలిపారు.

దీంతో ఖడ్కీలోని అమ్యునిషన్ ఫ్యాక్టరీ నూతన అధ్యాయాన్ని లిఖించిందని పేర్కొన్నారు. స్వయం సమృద్ధి, దేశీయంగా వీటిని తయారు చేయడంలో కొత్త అధ్యాయాన్ని లిఖించినట్లు భావిస్తున్నారు. 

40ఎంఎం యూబీజీఎల్ అత్యాధునికమైనది. హ్యాండ్ గ్రెనేడ్ కన్నా ఎక్కువ ప్రయోజనాలు దీని ద్వారా పొందవచ్చు. ఇది తేలికైనది కావడంతోపాటు 400 మీటర్ల పరిథిలోని లక్ష్యాలను ఛేదించవచ్చు. హ్యాండ్ గ్రెనేడ్ పరిథి 30 మీటర్లు మాత్రమే. 40ఎంఎం యూబీజీఎల్‌ను మోసుకెళ్లే సైనికులకు కూడా భద్రత ఉంటుంది.  

ఖడ్కీలోని అమ్యునిషన్ ఫ్యాక్టరీ సీనియర్ జనరల్ మేనేజర్ ఎంకే మహాపాత్ర 40ఎంఎం యూబీజీఎల్ (ప్రాక్టీస్) ఇన్‌స్పెక్షన్ నోట్‌ను బీఎస్ఎఫ్ డీఐజీ అశోక్ కుమార్ ఝాకు ఈ నెల 4న అందజేశారు.