ఆన్‌లైన్‌ వ్యవస్ధలోకి ఐఐటీలు, ఐఐఎంలు

ఇటీవల నూతన విద్యా విధానాన్ని ఆవిష్కరించిన నరేంద్ర మోదీ ప్రభుత్వం ఉన్నత విద్యా రంగంలోనూ పెనుమార్పులకు శ్రీకారం చుడుతోంది. ఐఐటీలు, ఐఐఎంలను ఆన్‌లైన్‌ విద్యా వ్యవస్ధ కిందకు తీసుకురావాలని యోచిస్తోన్న ప్రభుత్వం ఈ దిశగా యూజీసీ, ఏఐసీటీఈ నుంచి సూచనలను కోరుతోంది. 
 
విద్యార్ధులకు భౌతికంగా క్లాసులను నిర్వహించే భారాన్ని విద్యా సంస్ధలకు తగ్గించే దిశగా మొత్తం విద్యా వ్యవస్ధను ఆన్‌లైన్‌ విద్యా వ్యవస్థగా మార్చే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తున్నట్టు తెలుస్తున్నది. 
 
తొలుత ఉన్నత విద్యాసంస్ధలైన ఐఐటీలు, ఐఐఎంలను ఆన్‌లైన్‌ విద్యా వ్యవస్ధ కిందకు తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది.  దీనికి సంబంధించి బ్లూప్రింట్‌ను తయారుచేసేందుకు ఏఐసీటీఈ చీఫ్‌ అనిల్‌ సహస్రబుధే, యూజీసీ వైస్‌ చైర్మన్‌ డాక్టర్‌ ఎంపి పునియాల నేతృత్వంలో ప్రభుత్వం ఓ కమిటీని నియమించింది.
 
భారత విద్యార్ధులకు నాణ్యతతో కూడిన ఆన్‌లైన్‌ విద్యను అందించేందుకు అవసరమైన డిజిటల్‌ వేదికను ఏర్పాటు చేసే గురుతర బాధ్యతలను ఈ ఇద్దరు దిగ్గజాలకు ప్రభుత్వం కట్టబెట్టింది. 
 
ఆన్‌లైన్‌ విద్యకు అవసరమైన పటిష్ట మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడంపైనా వీరు కసరత్తు సాగిస్తారు. మరోవైపు చైనా యాప్‌లకు దీటుగా యాప్స్‌ను తయారుచేయాలని కేంద్ర మానవవనరుల అభివృద్ధి మంత్రి రమేష్‌ పోఖ్రియాల్‌ ఇటీవల ఐఐటీలను కోరారు.