సచిన్ పైలట్ ను ఆదుకున్న అబ్దుల్లాలు 

సచిన్ పైలట్ ను ఆదుకున్న అబ్దుల్లాలు 
రాజస్థాన్ ముఖ్యమంత్రి పదవి కోసం పార్టీపై తిరుగుబాటు చేసి, తమ మద్దతు దారులతో శిబిరం ఏర్పాటు చేసుకొంటూ వస్తున్న సచిన్ పైలట్ అకస్మాత్తుగా తిరోగమన బాట పట్టడం వెనుక ఆయన అత్తవారైనా అబ్దుల్లా కుటుంభం ఉన్నట్లు చెబుతున్నారు. 
 
కాంగ్రెస్ లో తగు మద్దతు కూడదీసుకోలేక పోవడం, బలం లేని అతని పాట అటు కాంగ్రెస్, ఇటు బిజెపి ఆసక్తి చూపకపోవడంతో రాజకీయంగా ఏకాకిగా మారే ప్రమాదం ఏర్పడింది. దానితో ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లాలు రంగంలోకి దిగి ఒక `గౌరవనీయ’  మార్గం లభించేటట్లు  రాహుల్, ప్రియాంక గాంధీలను రంగంలోకి తీసుకు వచ్చారు.  పైలట్ ఫరూక్ అబ్దుల్లాకు అల్లుడు కావడం గమనార్హం. 
 
ఈ సందర్భంగా వారు గుజ్జర్ల కార్డు ప్రయోగించిన్నట్లు  చెబుతున్నారు. రాజస్థాన్ లో గుజ్జర్ల ఓట్లను గంపగుత్తుగా  రాగలిగిన అతనిని వదులుకోవడం రాజకీయంగా నష్టం కాగలదని కాంగ్రెస్ నేతలను అబ్దుల్లాలు హెచ్చరించారు. ప్రస్తుతం ప్రియాంక గాంధీ బాధ్యతలు చేపట్టిన ఉత్తర ప్రదేశ్ లో గుజ్జర్ల ప్రాబల్యం సుమారు 55 నియోజకవర్గాలలో ఉంది. 
 
పార్టీలోని వరుసగా యువనేతలు నిష్క్రమిస్తూ ఉండడంతో రాహుల్ గాంధీ రాజకీయ ఉనికికె ప్రమాదం ఏర్పడగలదనే ఆందోళన మరోవంక పార్టీ అధిష్ఠానంకు మెట్టుదిగక తప్పలేదు. పార్టీలోని యువనేతలే వత్తిడి కారణంగానే రాహుల్, ప్రియాంక చొరవ తీసుకొని పైలట్ తో మంతనాలు జరిపినట్లు కనబడుతున్నది. 
 
అయితే కర్ణాటక, మధ్యప్రదేశ్ లలో వలే కాంగ్రెస్ ప్రభుత్వా లను పడగొట్టగల సామర్ధ్యం పైలట్ కు లేదని స్పష్టం కావడంతో పార్టీ షరతులకు పైలట్ లోబడాల్సి వచ్చిన్నట్లు కనబడుతున్నది. గెహ్లాట్ ఎత్తుగడల ముందు రాహుల్, ప్రియాంకలు తలవంచక తప్పలేదు. పైలట్ శిబిరంలో కొందరు గెహ్లాట్ మద్దతుదారులు ఉండడమే అందుకు కారణం. 
 
తిరుగుబాటుకు పైలట్ ముఖ్య వ్యూహకర్తగా భావించిన బన్వార్లాల్ శర్మ అరడజన్ ఎమ్యెల్యేలతో తిరిగి గెహ్లాట్ శిబిరం వైపు వెళ్ళడానికి సిద్దపడడంతో పైలట్ కు తోకముడవక తప్పలేదు. మధ్యప్రదేశ్ లో జ్యోతిరాదిత్య సింధియా వలే నిర్దిష్టమైన వ్యూహం లేకుండా అహంకారంతో రాహుల్, ప్రియాంకల మద్దతు ఉంటుందనే భరోసాతో హడావుడి చేసిన పైలట్ కు శృంగభంగం తప్పలేదు. 
 
ముఖ్యమంత్రి అశోక్ గెల్హట్  ను మార్చే ప్రసక్తి లేదని రాహుల్, ప్రియాంక స్పష్టం చేయవలసి రావడం గమనార్హం. పైగా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి పదవి ఇవ్వజూపడం ద్వారా రాజస్థాన్ రాజకీయాలకు పైలట్ దూరంగా ఉంటారనే సంకేతం కూడా ఇచ్చారు.