రష్యన్‌ వ్యాక్సిన్‌పై అనుమానాలు

కరోనా వైరస్‌ను ఎదుర్కొనడానికి వ్యాక్సిన్‌ను తయారుచేసినట్లు రష్యా ప్రకటించిన విషయం తెలిసింది. స్వయంగా ఆదేశ అధ్యక్షుడు పుతినే తన కూతురికే వ్యాక్సిన్‌ ఇచ్చినట్లు, ఆ బాగా పని చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఈ వ్యాక్సిన్‌పై బ్రిటన్‌, జర్మన్‌ నిపుణులు అనుమానాలు వ్యక్తం చేశారు. 
 
ప్రయోగ పరీక్షల ఫలితాలను ఎక్కడా వెల్లడించకపోవడంపై విమర్శలు గుప్పిస్తున్నారు. కేవలం రెండు నెలల ప్రయోగాల అనంతరం వ్యాక్సిన్‌ను ఆమోదించడంపై పెదవి విరిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తయారైన వ్యాక్సిన్‌ను నమ్మడం కష్టమని బ్రిటన్‌, జర్మనీ పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు. 
 
కరోనావైరస్‌ను ఎదుర్కొనేందుకు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలు వ్యాక్సిన్లను రూపొందించే పనిలో ఉన్నాయి. ఇప్పటికే మొదటి, రెండోదశ పరీక్షలను దాటి మూడో దశ మానవ ప్రయోగాలకు సిద్దమయ్యాయి. ఈ కంపెనీలు ఎప్పటికప్పుడు తమ పరీక్షల ఫలితాలను వెల్లడిస్తున్నాయి.
 
కానీ రష్యా మాత్రం వ్యాక్సిన్‌ ప్రయోగాలపై ఎలాంటి సమాచారం ప్రపంచానికి తెలపకుండానే టీకాను అభివృధ్ధి చేసినట్లు ప్రకటించడం నిర్లక్ష్య ధోరణేనని నిపుణులు పెదవి విరుస్తున్నారు. 
 
ఈ వ్యాక్సిన్‌ను రష్యా సమర్ధవంతంగా పరీక్షించలేదని జర్మనీ ఆరోగ్య శాఖ మంత్రి జెన్స స్పాన్‌ తీవ్ర ఆరోపణలు చేశారు.  ‘ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలకు కరోనా వ్యాక్సినేషన్‌ ఇవ్వడంలో మొదటిగా ఉండడం కంటే సురక్షితమైన వ్యాక్సిన్‌ ఇవ్వడమే ప్రధాన లక్ష్యం’గా ఉండాలని పేర్కొన్నారు.
 
 ‘ఇంత త్వరగా కోట్లాదిగా కాకపోయినా, లక్షలాది మందికి వ్యాక్సిన్‌ ఇవ్వడం ప్రమాదకరం. ఏదైనా తప్పు జరిగితే అనేక మందిని ఇది చంపేస్తుంది. అసలు రష్యాలో ఏం జరుగుతుందన్న దానిపైనా అనుమానంగా ఉంది’ అని స్పాన్‌ బుధవారం రేడియో బ్రాడ్‌కాస్టర్‌ డ్యూచ్‌లాండ్‌ ఫంక్‌తో చెప్పారు.
 
ముఖ్యంగా బ్రిటన్‌ శాస్త్రవేత్తలు మాత్రం రష్యా టీకాపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అత్యంత వేగంగా చేసే ప్రయోగాల వ్ల ప్రతికూల ప్రభావాలు కూడా ఉండవచ్చునని బ్రిటన్‌లోని వార్‌విక్‌ బిజినెస్‌ స్కూల్‌కు చెందిన పరిశోధకురాలు ఐఫర్‌ అలీ హెచ్చరించారు.
కొంత డేటా అయిన ప్రజల ముందుకు రాకుంటే, 2020 జూన్ నుంచి ఆగస్టు వరకు విజయవంతంగా ట్రయల్స్ నిర్వహించామని రష్యా  చెప్పినా ఈ వ్యాక్సిన్ సమర్థతను విశ్వసించడం కష్టమని పేర్కొన్నారు. బాల్ పునెకు చెందిన ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్, ఎడ్యుకేషన్, రీసెర్చి లో ఇమ్యునాలజిస్టుగా పని చేస్తున్న వినీతా బాల్ స్పష్టం చేశారు. 
 
అమెరికా కేంద్రమైన మౌంట్ సినాయి ఇకహన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ ప్రొఫెసర్ ఫ్లోరియన్ క్రమ్మెర్ వ్యాక్సిన్ భద్రతను ప్రశ్నించారు. ఈ వ్యాక్సిన్ మూడో దశ ట్రయల్స్‌లో పరీక్షలు లేనందున తాను దీన్ని అంగీకరించలేనని తేల్చి చెప్పారు. రష్యావారు ఆరోగ్య కార్యకర్తలను, ప్రజలను రిస్కులో ఉంచారని వ్యాఖ్యానించారు. క్రమ్మెర్ అభిప్రాయానికి భారత ఇమ్యునాలజిస్టు సత్యజిత్ రథ్ మద్దతు పలికారు.
 
కరోనా వ్యాక్సిన్ సిద్ధం చేసినట్లు రష్యా చెబుతున్నప్పటికీ దాని సమర్థత, భద్రతకు సంబంధించిన డేటా లోపించినప్పుడు అది ఎంతవరకు పనిచేస్తుందో నమ్మలేమని సిసిఎంబి డైరెక్టర్ రాకేశ్ మిశ్రా తేల్చి చెప్పారు.  పైగా,  అది ఇంకా మూడో దశ ట్రయల్స్‌లోనే ఉందని,  దీన్ని బట్టి అది ఇంకా పూర్తికాలేదని గుర్తు చేశారు.