శిరోముండనం బాధితుడికి రాష్ట్రపతి అండ

శిరోముండనం బాధితుడికి రాష్ట్రపతి అండ

ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా సీతానగరంలో పోలీసులతో  శిరోమండనంకు గురైన దళిత యువకుడు వరప్రసాద్‌కు  రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అండగా నిలిచారు.  ప్రసాద్‌ ఘటనపై రాష్ట్రపతి కార్యాలయం జోక్యం చేసుకుంది.

 శిరోముండనం ఘటనను సీరియస్‌గా తీసుకున్న రాష్ట్రపతి ప్రసాద్‌కు అండగా నిలబడేందుకు ప్రత్యేక అధికారిని నియమించారు. ఫిర్యాదు అందిన 24 గంటల వ్యవధిలోనే స్పందించిన కోవింద్ ఘటనలో బాధితుడికి పూర్తి స్థాయిలో సహకరించాలంటూ ఆంధ్రప్రదేశ్ జనరల్ అడ్మినిస్ట్రేషన్‌లో అసిస్టెంట్ సెక్రటరీ ఏ జనార్దన్ బాబుకు ఫైల్ ను బదిలీ చేశారు.

కేసు విషయంలో ఆయనకు సహకరించాలని, నేరుగా జనార్దన్ బాబుని కలవాలని వరప్రసాద్‌కు రాష్ట్రపతి కార్యాలయం సూచించింది. శిరోముండనం ఘటనపై పూర్తి స్థాయి కాల్ రికార్డులు, వీడియో క్లిప్పులు, కాల్ రికార్డింగ్‌లతో వరప్రసాద్‌ జనార్దన్ బాబుని కలవనున్నారు.

మరోవైపు రాష్ట్రపతి స్పందన శిరోముండనం బాధితుడు వర ప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రపతి జోక్యంతో తనకు న్యాయం దక్కుతుందనే భరోసా ఏర్పడిందని చెప్పారు.

స్థానిక వైకాసా నాయకుడి అనుచరుడి ఫిర్యాదు మేరకు ఇటీవల వెదుళపల్లిలో వరప్రసాద్‌ అనే దళిత యుకుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. తీవ్రంగా గాయపర్చడంతోపాటు పోలీస్‌స్టేషన్‌లోనే అతడికి శిరోముండనం చేశారు. 

ఈ ఘటనతో మనస్తాపం చెందిన వరప్రసాద్‌ తాను నక్సలైట్లలో కలుస్తానంటూ ఇటీవల రాష్ట్రపతికి లేఖ రాశారు. వరస్రాద్‌ లేఖపై రాష్ట్రపతి స్పందించి చర్యలు తీసుకున్నారు.  దీనిపై తక్షణమే స్పందించిన రాష్ట్రపతి బాధితుడికి పూర్తి స్థాయిలో సహకరించాలని ప్రత్యేక అధికారిని నియమించారు.