వెయ్యేండ్ల పాటు ఉండేలా రామ మందిర నిర్మాణం  

అయోధ్యలో రామ మందిరం కనీసం 1,000 సంవత్సరాల పాటు ఉండేలా రూపొందించబడుతుందని, అత్యధిక భూకంపాలను కూడా అది తట్టుకునేలా నిర్మిస్తున్నామని శ్రీ రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తెలిపారు.

అయోధ్యలోని కర్సేవాక్‌పురంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పునాదిలోని స్తంభాలు బలంగా, లోతుగా ఉంటాయని చెప్పారు. ఇది మందిరాన్ని ధృడంగా ఉంచి భకంపాన్ని సైతం తట్టుకునే శక్తిని కలిగి ఉంటుందని పేర్కొన్నారు. వేలాది సంవత్సరాల పాటు ఎలాంటి ప్రకృతి వైపరీత్యాలనైనా తట్టుకోగలదని భరోసా ఇచ్చారు.

డిజైన్ ఎలా ఉండబోతోంది.. తదితర విషయాలు త్వరలో తెలుపుతామని చెబుతూ దేవాలయ స్థలాన్ని తవ్వడానికి, సమం చేసేటప్పుడు వెలికితీసిన అన్ని కళాఖండాలు, శతాబ్దాల పురాతన అవశేషాలతో సహా ఆలయ ప్రాంగణంలో ప్రదర్శించబడతాయని వివరించారు. ఆలయ తుది పటాన్ని అయోధ్య అభివృద్ధి అథారిటీ ఆమోదిస్తుందని, అవసరమైన ఫీజులు వారికి చెల్లించనున్నట్లు పేర్కొన్నారు.

తాము ఎలాంటి రుసుము మినహాయింపును కోరుకోవడం లేదని ఆయన స్పష్టం చేశారు. ట్రస్ట్ ఖాతాలో ప్రస్తుతం రూ.42 కోట్ల బ్యాలెన్స్ ఉందని చెబుతూ రూ.1 నుంచి రూ.కోటి వరకు ప్రతీది లెక్క సరిగ్గా ఉందని తెలిపారు.

ఒక ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ భారతదేశం అంతటా కనీసం 20,000 మంది ఆలయ ఉద్యమంలో పాల్గొన్నారని, వారందరినీ ప్రారంభోత్సవానికి ఆహ్వానించడం సాధ్యం కాదని తెలిపారు. తాము అయోధ్య నుంచి 90 మంది, ఆలయ పట్టణం నుంచి 52 మందికి మాత్రమే ఆహ్వానాలను పంపగలిగినట్లు చెప్పారు.