పేస్ బుక్ పోస్ట్ తో బెంగళూరులో హింసాయుత దాడులు 

ఒక ఫేస్ బుక్ పోస్టును అడ్డం పెట్టుకొని గత రాత్రి బెంగుళూరులో కాంగ్రెస్ పార్టీకి చెందిన దళిత్ ఎమ్యెల్యే ఇంటిపై మూకలు జరిపిన దాడితో అల్లర్లు చెలరేగాయి. ఈ సందర్భంగా పోలీస్ కాల్పులలో  ముగ్గురు మృతి చెందగా, ఆందోళనకారుల దాడిలో ఏసీపీ సహా 60 మంది పోలీసులు గాయపడ్డారు. 

డీజీ హళ్లీ కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీనివాస మూర్తి మేనల్లుడు నవీన్ ఓ వర్గాన్ని కించపరుస్తూ ఫేస్ బుక్ లో పోస్టు పెట్టాడు. దాంతో ఆ వర్గానికి చెందిన వందలాది మంది ఆందోళన కారులు ఆ ఎమ్యెల్యే శ్రీనివాసమూర్తి ఇంటిపైననే కాకుండా, సమీపంలోని రెండు పోలీస్ స్టేషన్లపై కూడా దాడులకు దిగారు. 

అడ్డుకున్న పోలీసులపై రాళ్లు విసురుతూ దాడి చేశారు. ఆయన ఇంటి వద్ద ఉన్న వాహనాలను ద్వంసం చేసి నిప్పంటించారు. దాంతో పోలీసులు ఆందోళనకారులపై లాఠీ ఛార్జ్ చేస్తూ టియర్ గ్యాస్ ను ప్రయోగించారు. అయితే పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో కాల్పులు జరిపారు. 

ఈ కాల్పుల్లో ముగ్గురు చనిపోయారు. దాంతో  స్థానిక పోలీస్ స్టేషన్ పై మూకుమ్మడిగా దాడి చేశారు. స్టేషన్ ఆవరణలో ఉన్న 24 కార్లు, 200 బైకులకు నిప్పంటించారు. ఈ దాడులను కవర్ చేయడానకి వెళ్లిన ఒక రిపోర్టర్ కూడా గాయపడ్డాడు.

ఈ దాడుల పట్ల ఆగ్రహం చెందిన రాష్ట్ర హోమ్ మంత్రి బసవరాజ్ బొమ్మని పోలీస్ కమీషనర్ ను సంఘటన స్థలానికి పంపి, అవసరమైన చర్యలు తీసుకోమని ఆదేశించారు. అల్లరిమూకలను వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. అదనపు పోలీస్ బలగాలను మోహరింప చేశారు. 

పరిస్థితిని అదుపులోకి తెచ్చామని బెంగళూరు పోలీసు కమిషనర్ కమల్ పంత్ తెలిపారు. హింసాకాండకు గురైన డిజి హళ్లీ, కేజి హళ్లీ ప్రాంతాలలో రేపు ఉదయం వరకు కర్ఫ్యూ విధిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. మిగిలిన ప్రాంతాల్లో కూడా సభలు, సమావేశాలు నిషేధిస్తున్నట్లు ఆయన తెలిపారు. 

దాడులకు కారణమైన ఫేస్ బుక్ పోస్టు పెట్టిన నవీన్ అనే వ్యక్తిని అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు. అదేవిధంగా దాడికి పాల్పడిన 110 మందిని అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు.

కాగా, ఈ అల్లర్లు ఒక పధకం ప్రకారం జరిగినట్లు కనిస్తున్నదని కర్ణాటక మంత్రి సీటీ రవి తెలిపారు. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక గంటలోనే వేలాది మంది ఆందోళనకారులు ఎమ్మెల్యే నివాసానికి చేరుకుని దాడి చేయడం, 200-300 వాహనాలకు నిప్పుపెట్టడం వెనక పెద్ద కుట్ర ఉన్నదని ఆయన ఆరోపించారు. 

ఈ అల్లర్ల వెనుక ఎస్డీపీఏ ఉన్నదని మంత్రి అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై దర్యాప్తు జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి సీటీ రవి స్పష్టం చేశారు. 

ఇలా ఉండగా, ఎమ్యెల్యే మేనల్లుడు నవీన్ తన పేస్ బుక్ అకౌంట్ ను హాక్ చేసి ఈ పోస్ట్ ను సృష్టించారని, దానితో తనకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేసాడు.