తండ్రి ఆస్తిలో కుమార్తెకు సమాన హక్కులు

కుమార్తెకు కూడా తండ్రి ఆస్తిలో సమాన హక్కు ఉందని సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. సవరించిన హిందూ వారసత్వ చట్టం ప్రకారం ఇది కుమార్తెల హక్కు అని కోర్టు తెలిపింది. తండ్రి ఆస్తిలో తన సోదరుడితో సమానమైన వాటా కుమార్తెకూ లభిస్తుందని కోర్టు తెలిపింది. 
 
2005 సెప్టెంబర్ 9 నుండి కుమార్తెలకు హిందూ అవిభక్త కుటుంబ ఆస్తులలో వాటా లభిస్తుందని కోర్టు తెలిపింది. 2005లో కొడుకు, కుమార్తె ఇద్దరికీ వారి తండ్రి ఆస్తిపై సమాన హక్కులు ఉంటాయని ఒక చట్టం రూపొందించబడింది. 
 
అయితే, 2005కి ముందు తండ్రి మరణిస్తే అలాంటి కుటుంబానికి ఈ చట్టం వర్తిస్తుందా అనేది స్పష్టంగా తెలుపలేదు. అయితే, మంగళవారం న్యాయమూర్తి అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం ఈ చట్టం అన్ని పరిస్థితులలోనూ కుమార్తెలకు వర్తిస్తుందని తీర్పునిచ్చింది. 
 
చట్టం అమలుకు ముందు, అంటే 2005కి ముందే తండ్రి మరణించినప్పటికీ తండ్రి ఆస్తిపై కొడుకుతో పాటు కుమార్తెకూ సమాన హక్కులు లభిస్తాయని ధర్మాసనం తన తీర్పులో పేర్కొంది.

హిందూ వారసత్వ చట్టం 1965ను 2005 సంవత్సరంలో సవరించారని, దీని కింద తండ్రి ఆస్తిలో కుమార్తెలకు సమాన వాటా ఇవ్వడానికి ఒక నిబంధన ఉందని కోర్టు తెలిపింది. దీని ప్రకారం, కుమార్తెకు తండ్రి ఆస్తిపై కుమారునికి వున్నట్లే చట్టబద్ధమైన హక్కు ఉంటుంది. దీనికి వివాహంతో సంబంధం లేదని న్యాయస్థానం తన తీర్పులో వెల్లడించింది.