హింసాకాండ బాధ్యులనుండే నష్టపరిహారం 

బెంగుళూరులో చెల‌రేగిన హింసాత్మ‌క ఘ‌ట‌న‌లు కలకలం రేపాయి. అల్లర్లలో ముగ్గురు వ్యక్తులు మరణించగా మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. హింసాకాండకు బాధ్యులపై ప్రభుత్వం కఠిన చర్యలు చేపడుతుందని కర్ణాటక హోంమంత్రి బసవరాజ్‌ బొమ్మై స్పష్టం చేశారు. 

ప్రభుత్వ ఆస్తులు, వాహనాలను ధ్వంసం చేసిన వారి నుంచే నష్టాలను రికవరీ చేస్తామని వెల్లడించాయిరు. హింసలో ఎలాంటి నష్టం వాటిల్లినా అల్లరి మూకల నుంచే రికవరీ చేయాలని సుప్రీంకోర్టు పేర్కొన్న విషయాన్ని మంత్రి ప్రస్తావించారు. 

హింసకు పాల్పడిన వారిని గుర్తిస్తున్నామని, నష్టాలను అంచనా వేసి జరిగిన నష్టాన్ని బాధ్యుల నుంచే రికవరీ చేస్తామని చెప్పారు. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకున్నవారికి తగిన గుణపాఠం చెబుతామని ఆయన హెచ్చరించారు. బెంగళూరు హింసాకాండ వెనుక కుట్రను బహిర్గతం చేస్తామని స్పష్టం చేశారు. 

 కాగా బెంగళూర్‌లో జరిగిన హింసాకాండకు బాధ్యుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల్సిందిగా కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప అధికారులను ఆదేశించారు. శాంతియుత వాతావ‌ర‌ణం క‌ల్పించ‌డానికి అక్క‌డికి చేరుకున్న పోలీసులపై కూడా దాడులు చేయ‌డం ఎంత మాత్రం ఆమోద‌యోగ్యం కాద‌ని ఆయన స్పష్టం చేశారు. 

ప‌రిస్థితిని చక్కదిద్దడానికి ప్ర‌భుత్వం అన్ని చ‌ర్య‌లు తీసుకుంటుంద‌ని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు. ప్ర‌జ‌లంద‌రూ సంయ‌నం పాటించాలని ఆయ‌న కోరారు.