కేంద్ర మంత్రి యశోనాయక్‌ శ్రీపాదకు కరోనా

కేంద్ర మంత్రి శ్రీపాద్ యెస్సో నాయక్‌కు కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా ఆయనే ప్రకటించారు. ఉత్తర గోవా నుంచి ఎంపీగా గెలిచిన ఆయన ప్రస్తుతం కోవిడ్-19 చికిత్స పొందుతున్నట్లు ప్రకటించారు. 
 
అయితే తనకు కరోనా వైరస్‌కు సంబంధించి ఎలాంటి లక్షణాలు లేవని కానీ పరీక్షలో పాజిటివ్ అని తేలిందని చెప్పుకొచ్చారు.  ఇప్పటికే కేంద్ర హోంమంత్రిత్వ శాఖ మంత్రి అమిత్‌ షాతో పాటు మరో నలుగురు మంత్రులకు కరోనా సోకిన విషయం తెలిసిందే.
 
‘‘ఈరోజు కోవిడ్-19 పరీక్ష చేయించుకున్నాను. అందులో నాకు కరోనా వైరస్ సోకినట్లు తేలింది. అయితే నాకు కోవిడ్-19 లక్షణాలు ఏవీ లేవు. ప్రస్తుతం మా ఇంట్లోనే సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉన్నాను. నాతో కొద్ది రోజులుగా సన్నిహితంగా ఉన్నవారు వెంటనే కోవిడ్-19 పరీక్షలు చేయించుకోవాలని కోరుతున్నాను. అలాగే కోవిడ్ నిబంధనలు పాటించాలని సూచిస్తున్నాను’’ అని శ్రీపాద్ ట్వీట్ చేశారు. 
 
ఇలా ఉండగా,   ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ సెల్ఫ్ ఐసొలేషన్‌లోకి వెళ్లారు. తన భార్యకు కరోనా పాజిటివ్ రావడంతో తాను, తన కుటుంబసభ్యలు సెల్ఫ్ ఐసొలేషన్‌లోకి వెళ్తున్నట్టు బుధవారం ఆయన ఒక ట్వీట్‌లో తెలిపారు. ఇటీవల కాలంలో తనను కలిసిన వారు కూడా సెల్ఫ్ ఐసొలేషన్‌కు వెళ్లాలని కోరారు.