అసోం సీఎంగా మరోసారి హిమంత బిశ్వ శర్మ12న ప్రమాణ స్వీకారం 

అసోం సీఎంగా మరోసారి హిమంత బిశ్వ శర్మ12న ప్రమాణ స్వీకారం 
ప్రస్తుత ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ మరోసారి అసోం ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. హిమంతను బీజేపీ ఎల్పీ లీడర్‌‌గానే కాకుండా, ఎన్‌డీయే కూటమి లెజిస్లేటివ్ పార్టీ లీడర్‌‌గా ఆదివారం ఎన్నుకున్నారు. ఈ నెల 12, మంగళవారం హిమంత సీఎంగా పదవీ ప్రమాణం చేయనున్నారు. ఆయన ఆధ్వర్యంలో అసోంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. 

హిమంత ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానున్నారు. ఎన్‌డీయే ఎల్పీ లీడర్‌‌గా ఎన్నికైన అనంతరం హిమంత మాట్లాడుతూ ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయాధ్యక్షుడు నితిన్ నబీలకు కృతజ్ఞతలు తెలిపారు.

‘‘వరుసగా మూడోసారి అసోంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రధాని మోదీ మమ్మల్ని ఆశీర్వదించారు. ప్రధాని మోదీకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించారు. రాబోయే ఐదేళ్లు ప్రజల కోసం, అభివృద్ధి కోసం కష్టపడతాం. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబీకి కృతజ్ఞతలు” అని హిమంత బిశ్వ శర్మ తెలిపారు.

ఆదివారం ఉదయం గౌహతిలో జరిగిన బీజేపీ శాసనసభ పక్ష సమావేశంలో, రంజీత్ కుమార్ దాస్, విశ్వజిత్ డైమరీ , అజంతా నియోగ్ సహా మొత్తం ఎనిమిది మంది బీజేపీ ఎమ్మెల్యేలు డాక్టర్ శర్మ పేరును నాయకుడిగా ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనను సమావేశానికి హాజరైన మిగిలిన ఎమ్మెల్యేలందరూ బలపరిచారు. ఆ తర్వాత, ఏజిపి, బిపిఎఫ్ శాసనసభ్యులందరితో జరిగిన సంయుక్త సమావేశంలో, డాక్టర్ హిమంత విశ్వ శర్మ ఎన్డీయే కూటమి నాయకుడిగా ఏకగ్రీవంగా ఆమోదించారు. 

ఈ లాంఛనప్రాయ ప్రతిపాదనల అనంతరం, బీజేపీ కేంద్ర పరిశీలకులు జగత్ ప్రకాష్ నడ్డా, డాక్టర్ శర్మను బీజేపీ, ఎన్డీయే కూటమి రెండింటికీ నాయకుడిగా అధికారికంగా ప్రకటించారు. నాయకుడిగా ఎన్నికైన తర్వాత, డాక్టర్ శర్మ ఈ మధ్యాహ్నం ‘లోక్ సేవ భవన్’లో గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్యను కలిశారు. 102 మంది ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన పత్రాన్ని సమర్పిస్తూ, కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు డాక్టర్ శర్మ అధికారికంగా తన సంసిద్ధతను తెలిపారు. 

ఇటీవల జరిగిన అసోం అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్‌డీయే కూటమి భారీ విజయం సాధించింది. 126 సీట్లున్న అసెంబ్లీలో ఎన్‌డీయే కూటమి 102 సీట్లు సాధించింది. అందులో బీజేపీకి 82 సీట్లు దక్కాయి. కూటమిలోని మిగతా రెండు పార్టీల్లో ఏజీపీకి 10 సీట్లు, బీపీఎఫ్ 10 సీట్లు గెలుచుకున్నాయి. ఎన్నికల ఫలితాలు వెలువడ్డ అనంతరం, అంటే బుధవారం నాడే అసోం సీఎంగా హిమంత తన పదవికి రాజీనామా చేశారు.