ప్రణబ్ ఆరోగ్య పరిస్థితి విషమం

మాజీ  రాష్ట్రపతి, కాంగ్రెస్ అగ్రనేత నేత ప్రణబ్ ముఖేర్జీ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. మెదడులో రక్తం గడ్డకట్టడంతో రెండు రోజుల క్రితం ప్రణబ్ ఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రిఫరల్ ఆసుపత్రిలో చేరారు. అయితే ప్రణబ్ కు క్లిష్టమైన చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు వెల్లడించారు. 
 
ప్రస్తుతం ప్రణబ్ ను ‌వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందిస్తున్నట్టు వైద్యులు తెలిపారు. తనకు కరోనా పాజిటివ్ నిర్థారణ అయినట్టు మూడు రోజుల క్రితం ప్రణబ్ ట్విట్టర్ ద్వారా వెల్లడించిన విషయం తెలిసిందే. 
 
తనతో సన్నిహితంగా మెలిగినవారు, తనతో కాంటాక్టులో ఉన్నవారు కూడా కరోనా పరీక్షలు చేయించుకోవాలని, హోంక్వారంటైన్ లో ఉండాలని ఆయన సూచించారు. ఇదిలా ఉండగా ప్రణబ్ ఆరోగ్య పరిస్థితిపై రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోడీ తదితరులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రణబ్ త్వరగా కోలుకోవాలని వారు ఆకాంక్షించారు.
 
కాగా, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌ నాథ్‌ సింగ్‌ ఆసుపత్రిని సందర్శించి, ప్రణబ్‌ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను సమాచారం అడిగి తెలుసుకున్నారు. తాను ఆర్‌ అండ్‌ ఆర్‌ ఆర్మీ ఆసుపత్రిని సందర్శించానని, ప్రణబ్‌ ముఖర్జీ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని రాజ్‌ నాథ్‌ సింగ్‌, తన ట్విట్టర్‌ ఖాతాలో వెల్లడించారు.
ఇలా ఉండగా, మహారాష్ట్రలోని అమరావతి ఎంపీ నవనీత్ కౌర్ ఆరోగ్యం క్షీణించింది. ఇటీవలో నవనీత్ కౌర్ తో పాటు ఆమె కుటుంబంలోని 12 మందికి కరోనాసోకింది. కరోనా సోకిన వారిలో ఆమె భర్త రానా, ఆమె పిల్లలు, అత్తమామలు ఉన్నారు. దీంతో వారు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. 
 
చికిత్స పొందుతున్న క్రమంలో నవనీత్ కౌర్ ఆరోగ్యం క్షీణించడంతో నాగపూర్ లోని ఓఖార్డ్ ఆసుపత్రిలో చేర్పించారు. నవనీత్ కౌర్ పలు తెలుగు సినిమాల్లో నటించారు. గత లోక్ సభ ఎన్నికల్లో ఆమె అమరావతి నుంచి ఎంపిగా గెలిచారు. నవనీత్ కౌర్ ఆరోగ్యం క్షీణించిందన్న వార్తలు రావడంతో ఆమె అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. ఆమె త్వరగా కోలుకోవాలని వారు ఆకాంక్షిస్తున్నారు.