* క్రిమినల్ కేసు నమోదు చేయాలి.. బహిరంగ క్షమాపణకై డిమాండ్
ప్రధానమంత్రి నరేంద్ర మోదీని “ఉగ్రవాది”గా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అభివర్ణించడాన్ని నిరసిస్తూ, ఒక ఉన్నత స్థాయి బీజేపీ ప్రతినిధి బృందం బుధవారం ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ను కలిసి ఫిర్యాదు చేసింది. ఖర్గేపై భారతీయ న్యాయ సంహితలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేయడంతో పాటు, ఇలాంటి ప్రవర్తనను పునరావృతం చేయవద్దని హెచ్చరించాలని, అభ్యంతరకరమైన పోస్ట్‌ను తొలగించాలని అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను ఆదేశించాలని బీజేపీ కోరింది.
అంతకుముందు, మంగళవారం, మల్లికార్జున్ ఖర్గే వ్యాఖ్యలు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని స్పష్టంగా ఉల్లంఘించాయని ఆరోపిస్తూ బిజేపీ ఈ విషయంపై ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. ఈ వ్యాఖ్య భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్)లోని సెక్షన్ 175 కింద నేరమని, ప్రాథమికంగా ఇది పరువు నష్టం కేసుగా కూడా పరిగణించాలని స్పష్టం చేసింది. ఈ విషయాన్ని భారత ఎన్నికల సంఘం (ఈసీ) సుమోటోగా స్వీకరించాలని కోరుతూ, కాంగ్రెస్ అధినేత బహిరంగ క్షమాపణ చెప్పేలా ఆదేశాలు జారీ చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది.
“మేము తీవ్రంగా గాయపడ్డాము. ఆవేదనకు గురయ్యాము. తీవ్ర ఆగ్రహానికి లోనయ్యాము. చాలా భారమైన హృదయంతో మేము ఈరోజు ఈసీని కలిసి, కాంగ్రెస్ అధ్యక్షుడిపై సాధ్యమైనంత కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాము. ఈసీ తన నిర్ణయం తీసుకుంటుండగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రతి ఒక్క ఉగ్రవాదిని నిర్మూలిస్తామని మేము ప్రతిజ్ఞ చేస్తున్నాము,” అని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఎన్నికల కమిషనర్ ను కలిసిన అనంతరం తెలిపారు.
ఆయన పక్కన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఉన్నారు. ప్రధానమంత్రిని దూషించే కాంగ్రెస్ పద్ధతి 2007 నాటిదని, అప్పుడు సోనియా గాంధీ “మౌత్ కా సౌదాగర్” (మృత్యు వ్యాపారి) అనే పదాలను ఉపయోగించారని రిజిజు ఆగ్రహం వ్యక్తం చేశారు. “ఆ తర్వాత కాంగ్రెస్ నాయకులు ప్రధానిని తిట్టడాన్ని అలవాటుగా చేసుకున్నారు. ఆయనను ‘నీచుడు’, విషసర్పం, ఇంకా ఏవేవో అని పిలిచారు. మర్యాద అన్ని హద్దులను దాటిన కాంగ్రెస్‌కు భారత ప్రజలు తగిన సమాధానం ఇస్తారు,” అని రిజిజు హెచ్చరించారు.
“మీడియా, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను దానిని తొలగించమని ఆదేశించండి. ఎన్నికల ప్రక్రియ గౌరవాన్ని కాపాడటానికి, స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత, శాంతియుత, అంశాల ఆధారిత ప్రచారాన్ని నిర్ధారించడానికి అవసరమైన తదుపరి ఉత్తర్వులు జారీ చేయండి,” అని బీజేపీ కోరింది.

More Stories
ప్రపంచానికి జీవితంపై భారత్ దృక్పథం అవసరం
ప్రధాని మోదీ ఒక ‘ఉగ్రవాది’.. ఖర్గే వ్యాఖ్యలపై రాజకీయ దుమారం
ఉదయనిధి ఎన్నికల అఫిడవిట్లో రూ. 7.36 కోట్ల పెట్టుబడి అదృశ్యం