దేశవ్యాప్తంగా ఎన్నికల నగారా మోగుతున్న వేళ విపక్ష నేత, కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే చిక్కుల్లో పడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించాయని భావించిన ఎన్నికల కమిషన్ ఆయనకు నోటీసులు జారీ చేసింది.
ప్రధాని మోదీ తీవ్రవాది అంటూ చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలంటూ నోటీసులు జారీ చేసింది. 24 గంటల్లోగా వివరణ ఇవ్వాలని స్పష్టం చేసింది. తమిళనాడు, బెంగాల్ (తొలిదశ)లో పోలింగ్‌కు ఒకరోజు ముందు ఈ పరిణామం చోటుచేసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. మంగళవారం ఒక ప్రెస్‌మీట్ సందర్భంగా మల్లికార్జున ఖర్గే ప్రధాని మోదీని తీవ్రవాది అంటూ వ్యాఖ్యానించారు. ఏఐఏడీఎంకే బీజేపీతో పొత్తు పెట్టుకోవడాన్ని విమర్శిస్తూ ఖర్గే ఈ వ్యాఖ్యలు చేశారు.
“మల్లిఖార్జున ఖర్గే ఎన్నికల ప్రవర్తనా నియమావళిలో పేర్కొన్న నిబంధనలను కమిషన్ జారీ చేసిన సంబంధిత సూచనలను ఉల్లంఘించారని కమిషన్ ప్రాథమికంగా అభిప్రాయపడుతోంది. ఈ నోటీసు జారీ చేసిన తేదీ నుంచి 24 గంటలలోపు పై విషయానికి సంబంధించి మీ వాదనను వివరించడానికి కమిషన్ మీకు అవకాశం ఇస్తుంది. నిర్దేశించిన గడువులోగా మీ వైపు నుంచి ఎటువంటి స్పందన రాకపోతే, ఈ విషయంలో మీరు వివరించడానిక ఏమీ లేదని భావిస్తాం. అనంతరం మిమ్మల్ని మళ్లీ సంప్రదించకుండానే ఈ విషయంలో తగిన చర్య తీసుకుంటాం” అని ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది.
అంతకుముందు మల్లికార్జున ఖర్గేపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్మలా సీతారామన్, కిరణ్ రిజిజు, అర్జున్ రామ్ మేఘవాల్లతో కూడిన కేంద్ర మంత్రుల బృందం ఎన్నికల సంఘాన్ని కలిసి విజ్ఞప్తి చేసింది. తమిళనాడు, బెంగాల్ ఎన్నికల్లో ఓటమి భయంతోనే కాంగ్రెస్ పార్టీ ప్రధానిపై వ్యక్తిగతంగా విద్వేషం వెళ్లగక్కుతోందని నిర్మలా సీతారామన్ ఆరోపించారు.
ఖర్గే వ్యాఖ్యలు దేశ గౌరవానికి భంగం కలిగించేలా ఉన్నాయని కేంద్రమంత్రి కిరణ్ రిజిజు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రుల అభ్యర్థనను పరిగణంలోకి తీసుకున్న ఈసీ, మల్లికార్జున ఖర్గేకు నోటీసులు జారీ చేసింది.

More Stories
బెంగాల్, తమిళనాడులలో పోలింగ్ ప్రారంభం
ఈడీ దాడుల మధ్యలోకి మమతా వెళ్లడంపై సుప్రీం ఆగ్రహం
మతాచారాలకు ప్రమాణాలను నిర్వచించడం కష్టమే!