72 గంటల్లోగా కరోనా పరీక్షలు పూర్తి చేయండి 

వ్యాధి లక్షణాలున్నట్లు 72 గంటల్లో గనుక నిర్ధారణ అయితే మహమ్మారని నియంత్రించడం చాలా సులువని నిపుణులు పేర్కొంటున్నారని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. పది రాష్ట్రాల సీఎంలతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తూ  అందుకే వ్యాధితో సంబంధమున్న వారితో సంపర్కంలోకి వచ్చిన వ్యక్తులకు 72 గంటల్లోగా పరీక్షలు పూర్తి చేయడం చాలా ముఖ్యమని  సూచించారు.
కరోనా టెస్ట్ లు తక్కువగా ఉన్న రాష్ట్రాలలో వాటి సంఖ్యను పెంచవలసి ఉన్నదని చెబుతూ ఈ పది రాష్ట్రాలలో కరొనపై విజయం సాధించగలిగితే, దేశం ఈ మహమ్మారి నుండి బైటపడినట్లే అని ప్రధాని వెల్లడించారు. ముఖ్యంగా బీహార్, ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, తెలంగాణ, గుజరాత్ లలో టెస్ట్ ల సంఖ్యను గణనీయంగా పెంచవలసి ఉన్నదని స్పష్టం చేశారు.
 
దేశంలోని క్రియాశీల కేసులలో 80 శాతం ఈ పది రాష్ట్రాలలోని ఉన్నట్లు ప్రధాని గుర్తు చేసారు.  ప్రతి రోజూ 7 లక్షల టెస్టులు చేస్తున్నారని, ఈ సంఖ్య పెరుగుతూనే ఉందని తెలిపారు. వ్యాధి సంక్రమణను గుర్తించి, నివారించడానికి ఇది ఎంతో సహాయకారిగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
 
మొదటి నుంచీ కూడా ఇతర దేశాలతో పోల్చుకుంటే మన దేశంలో మరణాల రేటు తక్కువగానే ఉందని, ఇంకా తగ్గుముఖం పడుతోందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. అయితే మరణాల రేట్ ను 1 శాతం కన్నా తక్కువకు తీసుకు రావలసి ఉన్నదని తెలిపారు. 
 
యూపీ, హర్యానా, ఢిల్లీ తదితర ప్రాంతాల్లో కోవిడ్ విజృంభణ ఎక్కువగా ఉండేదని, అయితే. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా నేతృత్వంలో ఓ కమిటీని ఏర్పాటు చేశామని, దీంతో ప్రస్తుతం అదుపులో ఉందని మోదీ తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ఏపీ, కర్నాటక, తమిళనాడు, తెలంగాణ, బెంగాల్, మహారాష్ట్ర, పంజాబ్, బిహార్, గుజరాత్, యూపీ రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు.