పశ్చిమబెంగాల్ ప్రభుత్వానికి ఆ రాష్ట్ర గవర్నర్ జగదీప్ ధంకర్ ఘాటైన లేఖ రాశారు. రాష్ట్ర రైతులకు అన్యాయం జరుగకుండా చూడాలని ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ఆ లేఖలో కోరారు. బెంగాల్‌లోని 70 లక్షల మంది రైతులకు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ప్రయోజనాలు దక్కకపోవడం గర్హనీయమని, రైతులకు హక్కుగా దక్కాల్సిన రూ.8400 కోట్లను ఇప్పటికే రాష్ట్రం కోల్పోయిందని లేఖలో గవర్నర్ ప్రస్తావించారు.
దేశవ్యాప్తంగా ఇప్పటివరకు ప్రతిరైతు రూ.12,000 నగదు పొందగా, రాష్ట్ర ప్రభుత్వ వివాదాస్పద వైఖరితో బెంగాల్ రైతులు వారికి దక్కాల్సిన మొత్తాన్ని పొందలేకపోయారని గవర్నర్ ధంకర్ ఆవేదన వ్యక్తంచేశారు. ఈ విషయాన్ని తాను మీతో పాటు ప్రభుత్వ అధికారుల దృష్టికి పలుమార్లు తీసుకువచ్చానని మమతాబెనర్జికి గుర్తుచేశారు.
రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన రైతులను గుర్తిస్తే కేంద్ర ప్రభుత్వం వారి ఖాతాల్లోకి నగదు బదిలీ చేస్తుందని గవర్నర్ ఆ లేఖలో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి అర్హులైన రైతులను గుర్తించే ప్రక్రియను ఎందుకు చేపట్టడంలేదో తనకు అర్ధం కావడంలేదని గవర్నర్ ధంకర్ పేర్కొన్నారు.
బెంగాల్ ప్రభుత్వ తీరు రైతుల ప్రయోజనాలకు విఘాతమని, రైతులను నష్టాలకు గురిచేయడమేనని అభిప్రాయపడ్డారు. దేశమంతటా రైతులు ఇప్పటివరకు రూ.92,000 కోట్లు నగదు సాయంగా అందుకోగా, రాష్ట్రానికి ఒక రూపాయి కూడా రాలేదని గుర్తుచేశారు.
బెంగాల్ రైతులకు జరిగిన నష్టాన్ని గుర్తించి తక్షణమే దిద్దుబాటు చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి మమతాబెనర్జిని గవర్నర్ ధంకర్ కోరారు.
More Stories
త్వరలో జనగణన… ఆ తర్వాతే కులగణనపై నిర్ణయం!
ఢిల్లీ తదుపరి ముఖ్యమంత్రిగా అతిశీ
రికార్డు స్థాయిలో బాలాపూర్ లడ్డుకు రూ 30 లక్షల ధర