బంగళాఖాతంలోని గ్రేట్ నికోబార్ ద్వీపంలో రూ.10 వేల కోట్లతో సరుకురవాణా నౌకాశ్రయాన్ని నిర్మించటానికి కేంద్రం ప్రణాళికలు వేస్తున్నది. జలరవాణా పరంగా కీలకమైన ఈ ప్రాంతంలో నౌకాశ్రయ నిర్మా ణం ద్వారా అటు అంతర్జాతీయ జలరవాణా మార్కెట్లోకి దూసుకెళ్లటంతోపాటు ఇటు స్థానికంగా పెద్ద ఎత్తున ఉద్యోగవకాశాలు అందుబాటులోకి రానున్నాయి.
అండమాన్ నికోబార్ దీవులకు హైస్పీడ్ ఇంటర్నెట్ సదుపాయాన్ని అందించటానికి వీలుగా సముద్రం లోపలి నుంచి వేస్తున్న (అండర్ సీ) తొలి సబ్‌మెరైన్ ఆప్టికల్ ఫైబర్ ప్రాజెక్టును ప్రధాని నరేంద్రమోదీ సోమవారం వీడియోలింక్ ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈ వివరాల్ని వెల్లడించారు.
2,312 కిలోమీటర్ల పొడవైన ఈ ప్రాజెక్టును రూ.1,224 కోట్ల వ్యయంతో చెన్నై నుంచి అండమాన్ నికోబార్ దీవుల వరకూ నిర్మించారు. దీనివల్ల చవకగా ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి వస్తాయని ప్రధాని పేర్కొన్నారు.
ఇదే సందర్భంగా ఆయన గ్రేటర్ నికోబార్ దీవుల్లో రూ.10 వేల కోట్లతో సరుకు రవాణా (ట్రాన్స్‌షిప్‌మెంట్) పోర్టును నిర్మించే యోచన ఉందని, ఇది నిర్మాణమైతే భారీ నౌకలను కూడా ఇక్కడ నిలుపటానికి వీలువుతందని వెల్లడించారు. ప్రతిపాదిత పోర్టు వల్ల భారత్‌కు రెండు ప్రయోజనాలు లభించనున్నాయి. అత్యంత రద్దీగా ఉండే ఈస్ట్-వెస్ట్ అంతర్జాతీయ నౌకారవాణా మార్గానికి దీనిద్వారా చేరువ కావచ్చు. తద్వారా స్వల్పవ్యవధి రవాణామార్గాలు అందుబాటులోకి వస్తాయి.
మరోవైపు, ఈ ప్రాంతంలో సముద్రం సహజంగానే ఎంతో లోతుగా ఉండటం వల్ల అత్యాధునిక భారీ స్థాయి నౌకలను కూడా ఇక్కడ లంగరు వేయటానికి వీలువుతుంది. ఈ పోర్టు నిర్మాణం వల్ల అంతర్జాతీయ జలరవాణా వాణిజ్యంలో భారత్ వాటాను పెంచటానికి వీలవుతుందని ప్రధాని మోదీ చెప్పారు.
వరదల ముప్పును ముందుగానే పసిగట్టి తగిన నష్టనివారణచర్యలు తీసుకోవటానికి ఒక శాశ్వతవ్యవస్థ అవసరమని, దీనికి కేంద్ర, రాష్ట్ర సంస్థల మధ్య మంచి సమన్వయం ఉండాలని ప్రధానమంత్రి మోదీ ఈ సందర్భంగా సూచించారు. వాతావరణ అంచనాలతోపాటు వరదలు వంటి ప్రకృతి విపత్తులను ముందుగానే ఊహించటానికి కృత్రిమమేధ వంటి అత్యాధునిక టెక్నాలజీలను ఉపయోగించుకోవాలని తెలిపారు.
More Stories
6 కొత్త వందే భారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
రెండు రోజుల్లో ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ రాజీనామా
ప్రధాన మంత్రి పదవి అంటే తిరస్కరించా!