వైద్యసేవలు నిలిపివేయనున్న జూనియర్ డాక్టర్లు 

తమ సమస్యలపై వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం నుంచి ఎటువంటి పరిష్కారం లభించకపోవడంతో నేటి నుంచి కొన్ని వైద్య సేవలు నిలిపివేయాలని జూనియర్ డాక్టర్లు నిర్ణయించారు. గత మూడు  రోజులుగా సిద్ధార్థ  వైద్య కళాశాలలో జూడాలు నల్లబ్యాడ్జీలు ధరించి వివిధ రూపాల్లో నిరసన వ్యక్తం చేస్తున్నారు. 
 
అయినప్పటికీ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో ఈరోజు నుంచి కొన్ని విధులు బహిష్కరించాలని నిర్ణయించారు.  సాధారణ వైద్య సేవలు అనగా ఓపీ,  వార్డుల హాజరుకు వెళ్లే విధులు ఈరోజు నుంచి బహిష్కరిస్తామని ఏపీ జూడాలు తెలిపారు. ఎమర్జెన్సీ, కోవిడ్ డ్యూటీలకు నల్ల బ్యాడ్జీలు ధరించి హాజరుకానున్నారు.
 
కరోనా సోకిన వారికి వైద్యసేవలందించడంలో కీలకంగా వ్యవహరిస్తోన్న జూనియర్‌ వైద్యుల పట్ల ఏపీ ప్రభుత్వం వివక్ష చూపుతోంది. వారికి మూడు నెలల నుంచి స్టైఫండ్‌ చెల్లించడం లేదు. రోగులకు సేవలందిస్తున్న క్రమంలో  కరోనా వైరస్ బారిన పడుతున్నా ఏ మాత్రం భయపడకుండా రికవరీ అయినా వెంటనే జూనియర్‌ డాక్టర్లు  మళ్లీ రోగులకు సేవలందిస్తున్నారు.
అయితే నాణ్యమైన రక్షణ పరికాలు సరఫరా చేయడం, వసతులు కల్పించడం, వైరస్‌ బారినపడుతున్న వైద్యులకు ప్రత్యేక వైద్యసదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. దీంతో, వారు శుక్రవారం నుంచి ఆందోళన బాటపట్టారు. రోగులకు ఇబ్బంది లేకుండా సేవలందిస్తూనే తమ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవుతున్నారు. ఇతర రాష్ట్రాల కంటే ఏపీలో జూనియర్‌ వైద్యులకు స్టైఫండ్‌ తక్కువగా ఇస్తున్నారు. అదీ కూడా సకాలంలో ఇవ్వడం లేదు.
 
రోగులకు సేవలందిస్తున్న నేపథ్యంలో కరోనా బారినపడి జూనియర్‌ డాక్డరు మృతి చెందితే, అతని కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా ఇచ్చే విధానం పలు రాష్ట్రాల్లో అమలవుతోంది. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించకపోవడంతో జుడాలు ఆందోళన చెందుతున్నారు. 
 
రాష్ట్రంలో దాదాపు పిజిలు, హౌస్‌ సర్జన్లు 8,500 మంది కోవిడ్‌ వైద్య సేవల్లో భాగస్వాములవుతున్నారు. వీరికి మే, జూన్‌, జులై స్టైఫండ్‌ ఇవ్వకపోవడమే కాకుండా జనవరి నుంచి పెరచాల్సిన స్టైఫండ్‌ను కూడా చెల్లించడం లేదు. 
 
కరోనా సేవలందిస్తోన్న జూనియర్‌ వైద్యులు వైరస్‌ బారిన పడుతుండడంతో మిగిలిన వారిపై పనిభారం పెరుగుతోంది. అయినా, ప్రభుత్వం శాశ్వత ప్రాతిపదికన వైద్యులను నియమించి వైద్యసేవలను పెంచే పని చేయడం లేదు. జనరల్‌ ఫిజీషియన్‌, సర్జరీ, పిడియాట్రిక్‌, గైనకాలజీ, ఆర్థోపెడిక్‌ ఇలా వివిధ విభాగాలకు సంబంధించి జూనియర్‌ డాక్టర్లు కరోనా సేవలందిస్తున్నారు.