జమ్ముకశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో నియంత్రణ రేఖ వెంబడి దేశంలోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్న ఒక ఉగ్రవాదిని భద్రతా దళాలు ఆదివారం కాల్చి చంపాయి. మరో ఇద్దరికి కూడా తుపాకీ గుళ్లు తాకడంతో వారు తీవ్రంగా గాయపడ్డారు. వారి పరిస్థితి తీవ్రంగా ఉన్నట్లుగా సమాచారం. ప్రస్తుతం ఈ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతున్నది.
నియంత్రణ రేఖను దాటి కృష్ణ లోయ సెక్టార్లోకి శుక్రవారం కొంతమంది ఉగ్రవాదులు చొరబడేందుకు ప్రయత్నించారు. వారిని పట్టుకోవడానికి భారత జవాన్లు ప్రయత్నించిన సమయంలో ఉగ్రవాదులు తప్పించుకుని పారిపోయేందుకు కాల్పులు జరిపారు. కాగా, ఎదురు కాల్పుల్లో ఒక ఉగ్రవాది మృతి చెందగా.. మరో ఇద్దరు గాయపడ్డారని ప్రో లెఫ్టినెంట్ కల్నల్ దేవేంద్ర ఆనంద్ తెలిపారు.
కాల్పులు జరిపిన తరువాత ఒక ఉగ్రవాది మృతదేహం వద్ద పాకిస్తాన్ లో ముద్రితమై ఉన్న ఫుడ్ ప్యాకెట్లు లభించాయి. చనిపోయిన ఉగ్రవాదిని తీసుకెళ్లేందుకు సహచరులు కొంతసేపు ప్రయత్నించారు. అయితే, గాయాల కారణంగా వారు ఆ పనిని విరమించుకున్నారు. చనిపోయిన వ్యక్తి నుంచి ఒక ఏకే-47, రెండు డాక్యుమెంట్లు, కొన్ని ఆహార పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు.
ఇలాఉండగా, జమ్ము కశ్మీర్‌లో ఉగ్రవాదులు ఆదివారం స్థానిక బీజేపీ నాయకుడిని కాల్చి చంపారు. బుద్గామ్‌లోని మోహింద్‌పోరాలో నివసిస్తున్న అబ్దుల్ హమీద్ నాజర్ బీజేపీకి చెందిన ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు.
నజర్ (38) ఆదివారం ఉదయం మార్నింగ్ వాక్ చేస్తుండగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన నాజర్ ను ఎస్ఎంహెచ్ఎస్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మరణించారు. నాజర్ కు పోలీసులు భద్రత కల్పించినప్పటికీ మార్నింగ్ వాక్ కోసం సెక్యూరిటీ సిబ్బందికి చెప్పకుండా బయటకు వెళ్లడంతో ఉగ్రవాదులు అతనిపై కాల్పులు జరిపారని పోలీసులు చెప్పారు.
జమ్మూకశ్మీర్ లో బీజేపీ నేతలపై ఉగ్రవాదులు జరిపిన నాలుగో దాడి ఇది. ఈ నెల 6వతేదీన కుల్గాం జిల్లాలో బీజేపీ సర్పంచ్ సాజాద్ అహ్మద్ ఖండేను కూడా ఉగ్రవాదులు హత్య చేశారు. జూలైలో బండిపోరా బీజేపీ మాజీ అధ్యక్షుడు వసీం బారి, అతని తండ్రి, సోదరుడిని కూడా ఉగ్రవాదులు దారుణంగా హత్యచేశారు.
More Stories
మంత్రులతో కలిసి త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు
భార్యతో సెల్ఫీతోనే మావోయిస్టు చలపతి హతం!
పార్లమెంట్లో ఎన్ఆర్ఐలకు ప్రాతినిధ్యం కల్పించాయి