కోజికోడ్ ప్రజలకు హర్దీప్ పురి సెల్యూట్ 

కేరళలోని కోజికోడ్‌లో ఘోరప్రమాదానికి గురైన ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ విమానం  కలకలం రేపింది. ల్యాండింగ్‌లో అదుపుతప్పిన ఎయిర్‌‌క్రాఫ్ట్‌ రన్‌వేను గట్టిగా ఢీకొట్టడంతో రెండు ముక్కలుగా విరిగింది. ఇద్దరు పైలట్లతో పాటు మొత్తంగా 18 మంది ప్రాణాలు కోల్పోయారు. 149 మంది చికిత్స పొందుతున్నారు. వీరిలో 23 మంది పరిస్థితి విషమంగా ఉంది. 

పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్‌ సింగ్‌ పురి, విదేశాంగ శాఖ సహాయమంత్రి మురళీధరన్‌ కూడా కేరళకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం అందించనున్నట్లు ప్రకటించారు. మృతుల కుటుంబాలకు కేరళ రాష్ట్ర ప్రభుత్వం కూడా రూ.10 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది. 

మరోవైపు ప్రయాణికుల్లో ఇద్దరికి కరోనా పాజిటివ్‌ తేలినట్లు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో. సహాయక చర్యల్లో పాల్గొన్నవారు కరోనా పరీక్షలు చేయించుకుని, స్వీయ నిర్బంధంలో ఉండాలని రాష్ట్రమంత్రి కేకే శైలజ సూచించారు.

 ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు త్వరగా స్పందించి చాలా సాయం అందించారు. వీరి సేవలను పౌరవిమానయాన మంత్రి హర్దీప్ సింగ్ పురి మెచ్చుకున్నారు. ‘కోజికోడ్ ప్రజల స్ఫూర్తి, సంఘీభావం, సోదరభావానికి నా సెల్యూట్. వాళ్లు చాలా రిస్క్ తీసుకొని వెంటనే స్పందించి బాధితులకు సాయం చేశారు. పెద్ద విషాదాన్ని నివారించడంలో ఇది దోహదపడింది’ అంటూ వారికి అభినందనలు తెలిపారు. 

‘అధికారుల విమానయాన  సేవలను మెచ్చుకోవాల్సిందే. వీబీఎం అదే స్ఫూర్తిని కొనసాగిస్తుంది. భారతీయులు ప్రపంచంలోని ఏ మూలలో చిక్కుకుపోయినా వారిని స్వదేశానికి తీసుకొస్తాం. ఈ దుర్ఘటనలో చనిపోయిన 18 మందికి రాష్ట్రం తరఫున మొత్తం భారతీయుల వైపు నుంచి నివాళులు అర్పిస్తున్నా’ అని పురి పేర్కొన్నారు.

ఘోరప్రమాదానికి గురైన ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ విమానం బ్లాక్‌బాక్స్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రమాదానికి కారణాలు తెలుసుకునేందుకు ఇది కీలకంగా మారనుంది. తదుపరి దర్యాప్తు నిమిత్తం దీనిని ఢిల్లీకి పంపించారు.