101 రక్షణ వస్తువుల దిగుమతులపై నిషేధం

రక్షణ వ్యవస్థలో ఉపయోగించే  101 వస్తువుల దిగుమతిపై నిషేధం విధిస్తూ రక్షణ శాఖ ఉత్తర్వులు జారీ చేసిన్నట్లు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ప్రకటించారు. ‘ఆత్మ నిర్భర్‌‌ భారత్‌’ కార్యక్రమానికి ఊతమిచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు.
ఆయుధ సంపత్తి సహా రక్షణ శాఖ ఉత్పత్తులు ఇక నుంచి మన దేశంలోనే తయారవుతాయని, ఇది మన రక్షణ శాఖ తయారీ రంగాన్ని బలోపేతం చేస్తుందని రాజ్‌నాథ్‌ సింగ్‌ తెలిపారు. దీంతో స్వదేశీ ‌ రంగానికి వచ్చే ఆరేళ్లలో దాదాపు రూ.4 లక్షల కోట్ల కాంట్రాక్టులు వస్తాయని వెల్లడించారు.
ఆర్టిలరీ గన్స్‌, అసల్ట్‌ రైఫిల్స్‌, కార్వీటీస్‌, సోనార్‌‌ సిస్టమ్‌, ట్రాన్స్‌పోర్ట్‌ ఎయిర్‌‌క్రాఫ్ట్స్‌, లైట్‌ కాంబాట్‌ హెలికాఫ్టర్స్‌, రాడార్స్‌ తదితర వస్తువులు ఈ జాబితాలో ఉన్నాయి.  స్టేక్  హోల్డర్స్‌, ఆర్మ్డ్‌ ఫోర్స్‌, పబ్లిక్‌, ప్రేవేట్‌ ఇండస్ట్రీలతో సంప్రదింపులు జరిపిన తర్వాత ఈ  జాబితాను‌ తయారు చేశామని రాజ్‌నాథ్‌ చెప్పారు.
ఏప్రిల్ 2015 నుంచి ఆగస్టు 2020 మధ్య త్రివిధ దళాలకు రూ  3.5 లక్షల కోట్ల విలువైన కాంట్రాక్టుల ద్వారా పరికరాలు దిగుమతి అయ్యాయి. ఇందులో ఆర్మీ, ఎయిర్‌ఫోర్సుకి కలిపి రూ  1,30,000 కోట్ల విలువైన వస్తువులు, రూ 1,40,000 కోట్ల విలువైన నావికాదళ ఆయుధాలు, పరికరాలు అవసరమవుతాయని అంచనా.
జాబితాలో ఆర్మర్డ్ ఫైటింగ్ వెహికిల్స్ కూడా ఉన్నాయి. వీటి దిగుమతిపై 2021 డిసెంబర్ నుంచి నిషేధం విధించారు. రూ 5,000 కోట్లు విలువైన 200 వీల్డ్ ఆర్మర్డ్ ఫైటింగ్ వెహికిల్స్ కి ఆర్మీ కాంట్రాక్టు ఇవ్వనుంది. రక్షణ వస్తువుల దిగుమతులపై నిషేధం 2020 నుండి 2024 మధ్య అమలు చేయడానికి రక్షణశాఖ ప్రణాళిక రూపొందించింది.
“ఈ నిర్ణయం వల్ల రక్షణ శాఖ వారి సొంత డిజైన్‌, సామర్థ్యాలను ఉపయోగించుకోవచ్చు. ఇది పరిశ్రమకు సాయపడుతుంది. అంతే కాకుండా రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌‌డీవో) రూపొందించిన, అభివృద్ధి చేసిన సాంకేతిక పరిజ్ఞానాన్ని అవలంబించుకుని అవసరాలు తీర్చుకునేందుకు ఉపయోగపడుతుంది” అని రాజ్‌నాథ్‌ సింగ్‌ విశ్వాసం వ్యక్తం చేశారు.