కేంద్ర భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్‌వాల్(60) కరోనా బారినపడ్డారు. దీంతో మంత్రిని ట్రామా సెంటర్ ఆఫ్ ఎయిమ్స్ లో చేర్చారు. కరోనా సోకిన కేంద్ర మంత్రుల జాబితాలో అర్జున్ రామ్ మేఘ్‌వాల్ నాలుగవ వ్యక్తి.
అంతకుముందు హోంమంత్రి అమిత్ షా, ధర్మేంద్ర ప్రధాన్, కైలాష్ చౌదరి కరోనా పాజిటివ్‌గా తేలారు. వైద్య విభాగానికి చెందిన డాక్టర్ నీరజ్ నిశ్చల్ పర్యవేక్షణలో అర్జున్ రామ్ మేఘ్‌వాల్ చికిత్స పొందుతున్నారు. మేఘ్‌వాల్‌కు తేలికపాటి కరోనా ఇన్‌ఫెక్షన్ ఉందని సమాచారం. అర్జున్ రామ్ మేఘ్‌వాల్ రాజస్థాన్‌లోని బికనేర్ లోక్‌సభ స్థానానికి చెందిన ఎంపీ.
ఇలా ఉండగా, కరోనా మహమ్మారి బారిన పడి దేశవ్యాప్తంగా ఇప్పటి వరకూ 196మంది వైద్యులు ప్రాణాలు కోల్పోయారని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆందోళన వ్యక్తం చేసింది.
వైద్యుల కుటుంబ సభ్యులకు కరోనా సోకితే.. ఆస్పత్రుల్లో బెడ్లు దొరకడం లేదని ఐఎంఏ సెక్రటరీ జనరల్ డాక్టర్ ఆర్‌ఏ అశోకన్ ఆవేదన వ్యక్తం చేశారు. వైద్యులకు ఇన్సూరెన్స్ తదితర సౌకర్యాలను అందించేలా మార్గదర్శకాలు జారీ చేయాలని కోరుతూ ప్రధాని మోదీకి ఐఎంఏ లేఖ రాసింది.
గత మూడు రోజుల నుంచి ప్రతిరోజు 60 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 64,399 కేసులు నమోదయ్యాయి. ఇంత భారీ సంఖ్యలో కేసులు నమోదుకావడం ఇదే మొదటిసారి. దీంతో దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 21,53,011కు చేరుకుంది. నివారం కరోనా వల్ల చనిపోయిన వారి సంఖ్య 861గా నమోదయంది. దాంతో మొత్తం మృతుల సంఖ్య 43,379కి చేరినట్లు కేంద్ర కుటుంబ మరియు ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
More Stories
జమ్ము కశ్మీర్లో కాంగ్రెస్ కూటమి, హర్యానాలో బిజెపి
భారత్ భద్రతను దెబ్బతీసేలా వ్యవహరించం
జార్ఖండ్‌లో ఎన్నార్సీని అమలు చేస్తాం