ఈ-సంజీవని పనితీరు ప్రశంసనీయం 

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటైన టెలీమెడిసిన్ సేవల పనితీరును కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖామంత్రి డాక్టర్ హర్ష వర్ధన్ ప్రశంసించారు.  ఈ-సంజీవని, ఈ సంజీవని ఒపిడి వేదికల ద్వారా ఒకటిన్నర లక్షల టెలిమెడిసిన్ కన్సల్టేషన్స్ పూర్తయిన సందర్భంగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో మంత్రి  సమీక్ష చేపట్టారు. 
 
ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అశ్విన్ కుమార్ చౌబే , తమిళనాడు ఆరోగ్యశాఖామంత్రి డాక్టర్ సి. విజయభాస్కర్ కూడా ఈ వర్చువల్ సమావేశంలో పాల్గొన్నారు.
 
అతి తక్కువ సమయంలో 2019 నవంబర్ నుంచి ఇప్పటి వరకు దేశ జనాభాలో 75శాతం మందికి సేవలందిస్తూ 23  రాష్ట్రాలు ఈ- సంజీవని, ఈ సంజీవని ఒపిడి వేదికలతో టెలీ కన్సల్టేషన్ సేవలందిస్తూ ఉన్నాయి. మిగిలిన రాష్ట్రాలు కూడా ఈ కార్యక్రమం చేపట్టే పనిలో ఉన్నాయి.
 
రోగులు, డాక్టర్లు ఇళ్లలో నుంచే సంప్రదింపులు జరపటానికి వెసులుబాటు కలిగించే ఈ కార్యక్రమంలో ఇప్పటివరకు లక్షన్నర మంది లబ్ధి పొందారు. ఇది ఒక మైలురాయిగా మంత్రి అభివర్ణించారు.