748మంది టీటీడీ ఉద్యోగులకు కరోనా  

 ఇప్పటివరకు 748మంది టీటీడీ ఉద్యోగులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని, వీరిలో ఇప్పటికే 405మంది కోలుకున్నారని టీటీడీ ఈవో అనిల్‌ కుమార్‌ సింఘాల్‌  తెలిపారు. ఇంకా 338 మంది చికిత్స తీసుకుంటుండగా ముగ్గురు మృతి చెందారని చెప్పారు.  కరోనా కేసుల పెరుగుదలతో కొద్ది రోజులుగా తిరుమలలో దర్శనాలు చేసుకునేవారి సంఖ్య తగ్గిందని పేర్కొన్నారు.
 
ఆదాయం కోసమే తిరుమల శ్రీవారి దర్శనాలు చేయిస్తున్నామన్న విమర్శల్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు.  భక్తుల అభీష్టం మేరకు కొవిడ్‌ నిబంధనలను అనుసరించి పరిమిత సంఖ్యలో దర్శనాలు కల్పిస్తున్నామని వివరణ ఇచ్చారు.  వాస్తవానికి కరోనా నేపథ్యంలో ఆదాయం కన్నా ఖర్చే ఎక్కువవుతోందని పేర్కొన్నారు. 
 
ఎస్వీబీసీ చానల్‌ నిర్వహణకు ఏడాదికి రూ.3నుంచి 4కోట్లు ఖర్చవుతోందని, అయినప్పటికీ.. త్వరలో యాడ్‌ ఫ్రీ చానల్‌గా, హెచ్‌డీ చానల్‌గా మారుస్తున్నామని ప్రకటించారు. హిందీ, కన్నడ భాషల్లో కూడా ఎస్వీబీసీ ప్రసారాలను ప్రారంభిస్తామని వెల్లడించారు.
త్వరలోనే తిరుమలలోని నాదనీరాజనం వేదికపై శ్రీమద్భగవద్గీత, గరుడపురాణ పారాయణాలను ప్రత్యక్షప్రసారం చేస్తామని సింఘాల్ తెలిపారు. జూలైలో శ్రీవారి హుండీ ఆదాయం రూ.16కోట్లు కాగా ఈ-హుండీ ద్వారా రూ.3 కోట్లు వచ్చిందని చెప్పారు.
టీటీడీ వార్షిక బడ్జెట్‌ రూ.3200 కోట్లు కాగా ఇందులో జీతాలకే రూ.1350 కోట్లు ఖర్చవుతుందని తెలిపారు. ఇప్పటివరకు కార్పస్‌ ఫండ్‌ నుంచి నిధులు తీసుకోలేదని,  భవిష్యత్‌లో అవసరాన్ని బట్టి  టీటీడీ బోర్డులో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
 ఆగస్టు నెలాఖరు తర్వాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలిచ్చే అన్‌లాక్‌ నిబంధనలను బట్టి శ్రీవారి బ్రహ్మోత్సవాల నిర్వహణపై పాలకమండలి సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.