11న సోము వీర్రాజు పదవీ స్వీకారం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బిజెపి నూతన అధ్యక్షుడిగా ఇటీవల నియమితులైన సోము వీర్రాజు ఈ నెల 11న బాధ్యతలు స్వీకరించనున్నారు. విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ దగ్గర గల ది వెన్యూ ఫంక్షన్ హాల్‌లో ఈ కార్యక్రమం జరుగనుందని విజయవాడ పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు వామరాజు సత్యమూర్తి తెలిపారు. 

మంగళవారం జరుగనున్న ఈ పదవీ స్వీకార కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్, అఖిల భారత సంఘటన్‌ సహ కార్యదర్శి సతీష్ జీ పాల్గొంటారని వెల్లడించారు. 

ఈ నేపథ్యంలో వామరాజు సత్యమూర్తి, రాష్ట్ర వ్యవహారాల సహా ఇంచార్జి సునీల్ దియోడర్, బీజేపీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి మధుకర్, పాకలపాటి సన్యాసిరాజు, అడ్డూరి శ్రీరామ్, పాలూరి శ్రీనివాసరావు తదితరులు కార్యక్రమ ప్రాంగణాన్ని ఆదివారం పరిశీలించారు.