నూతన జిల్లాల అధ్యయనానికి కమిటీ

నూతన జిల్లాల అధ్యయనానికి కమిటీ
రాష్ట్రంలో నూతన జిల్లాల ఏర్పాటుకు సంబంధించి అధ్యయనం చేసేందుకు ఓ కమిటీని నియమిస్తూ వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం  ప్రభుత్వం ఓ అడుగు ముందుకేసింది. జిల్లాల స్థాయిలో పరిపాలనను ప్రజలకు అందుబాటులోకి తీసుకెెళ్లే ప్రక్రియలో భాగంగా ప్రభుత్వం జిల్లాల సంఖ్యను 13 నుంచి 25కి పెంచాలని భావిస్తోంది. 
 
ఇప్పటికే పాలనా వికేంద్రీకరణలో భాగంగా గ్రామ, వార్డు సచివాలయాలు, వార్డు కార్యదర్శిలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రభుత్వం ఇటీవల తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయానికి అనుకూలంగా వికేంద్రీకరణను దృష్టిలో ఉంచుకుని కమిటీ చర్యలు చేపట్టాలని సూచించింది. ఇందు కోసం ఏర్పాటు చేసిన అధ్యయన కమిటీకి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షత వహిస్తారు. 
 
వారి పర్యవేక్షణలో ఐదుగురు సభ్యులతో కమిటీని నియమిస్తూ ప్రభుత్వం జిఒ ఆర్‌టి నెంబరు 2098ని శుక్రవారం విడుదల చేసింది. అధ్యయన కమిటీ ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలను 25 జిల్లాలుగా ఏర్పాటు చేసేందుకు మూడు నెలల కాలపరిమితిలోగా నివేదికను ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉంటుంది. కమిటీలో సభ్యులుగా సిసిఎల్‌ఎ కమిషనరు, సెక్రటరీ జనరల్‌ అడ్మినిస్ట్రేషన్‌ (సర్వీసెస్‌) ప్లానింగ్‌ డిపార్డుమెంట్‌ సెక్రటరీ సిఎంఒ కార్యాలయం నుంచి ఒక ప్రతినిధి ఉంటారు. 
 
వీరితోపాటు ఆర్థిక శాఖ కార్యదర్శి కమిటీ కన్వీనరుగా వ్యవహరించనున్నారు. కమిటీ సభ్యులు అన్ని జిల్లాల్లో వివిధ తరగతుల, ప్రజా ప్రతినిధులు నుంచి అభిప్రాయాలు సేకరించాల్సి ఉంటుంది. 
 
ఆయా జిల్లాలో పరిపాలనా సౌలభ్యం కోసం ఎటువంటి చర్యలు చేపట్టాల్సి ఉంటుంది? మానవ వనరులు ఏ మేరకు అందుబాటులో ఉన్నాయి? రాష్ట్ర, జిల్లా, స్థానిక సంస్థల నిర్మాణం, వాటి పాత్రలు, బాధ్యతలు అవసరమయ్యే మార్పులను కమిటీ అధ్యయనం చేయాల్సి ఉంటుంది. 
 
అన్ని దశల్లో మానవ వనరులు ఎంతమేర అందుబాటులో ఉన్నాయి? నూతన జిల్లాల ఏర్పాటుతో అదనంగా ఎంత మేర ఖర్చవుతుంది? ఆర్థిక వనరులు పెంచుకునేందుకు ఏయే మార్గాలున్నాయి? కొత్తగా ఏర్పడబోయో జిల్లాలకు బౌండరీలు నిర్ణయించడం తదితర అంశాలన్నింటినీ అధ్యయన కమిటీ పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది.