మాణిక్యాలరావు సిద్దాంతం కోసం పనిచేశారు

మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత పి మాణిక్యాలరావు తాను నమ్మిన సిద్ధాంతాలకు అంకిత భావంతో పనిచేసిన నేత అని పలువురు బీజేపీ నేతలు ఘనంగా నివాళులు అర్పించారు. రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు సారధ్యంలో  వీడియో కాన్ఫరెన్స్ లో జరిగిన సంతాప సభలో పార్టీ కోసం, ప్రజల కోసం ఆయన ఆరాటపడే వారని కొనియాడారు.

మాణిక్యాలరావు.. ఎంత ఎదిగినా, తన నమ్మిన సిద్దాంతాల కోసం పని చేశారని, మృదుస్వభావి అని,  కోపం వచ్చినా  వెంటనే మళ్లీ మాములు అయిపోయేవారని వీర్రాజు పేర్కొన్నారు. దేవాదాయశాఖ మంత్రిగా అనేక ఆటుపోట్లు ఎదుర్కొని  పని చేశారని ఆయన చెప్పారు. అభివృద్ది విషయంలో మాత్రం ఎక్కడా రాజీపడకుండా. పని చేసేవారని తెలిపారు. 1989 నుంచి బీజేపీ లోనే ఉంటూ.పార్టీ అభివృద్ది కోసం పని చేసిన ఆయన మరణం తనకు వ్యక్తిగతంగానూ, పార్టీకి కూడా తీరని లోటని విచారం వ్యక్తం చేశారు. 


పార్టీలో నిబద్దత కోసం పని చేసిన నాయకుడు మాణిక్యాలరావు అని మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ నివాళులు అర్పించారు. తాడేపల్లి గూడెం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై, దేవాదాయశాఖ మంత్రిగా పని చేస్తూనే పార్టీ ప్రధాన కార్యదర్శి గా బీజేపీ అభివృద్ది కోసం పని చేశారని తెలిపారు.

తనను ఎన్నుకున్న ప్రజల బాగోగులు, నియోజకవర్గ అభివృద్ది కోసం తపన పడుతుండేవారని చెప్పుకొచ్చారు. మంత్రి వర్గంలో ఉన్నప్పటికీ ముఖ్యమంత్రిని సైతం ఎదిరించి అమిత్ షా సహకారంతో నిట్ ను తన నియోజకవర్గంలో కేటాయించుకున్నారని కొనియాడారు.

దేవాలయాల అభివృద్ది కోసం అనేక కార్యక్రమాలను చేపట్టారని చెబుతూ తాను పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్న సమయంలో.. ప్రధాన కార్యదర్శిగా పార్టీ ఏ బాధ్యతలు అప్పగించినా కాదనకుండా పని చేశారని గుర్తు తెచ్చుకున్నారు. బూత్ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఎన్నికల బాధ్యతలను పూర్తి చేశారని చెప్పారు. లాక్ డౌన్ నిబంధనలు అమల్లో ఉన్నా పార్టీ అప్పచెప్పిన బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహించారని చెప్పారు. 


మాణిక్యాలరావు వంటి మంచి మనిషిని పార్టీ కోల్పోవడం బాధాకరమని కేంద్ర రైల్వే మంత్రి సురేష్ ప్రభు చెప్పారు. “నాకు ఎంతో ఆత్మీయుడు.. ఎన్నో విషయాలను చర్చించకున్నాం”  అంటూ గుర్తు చేసుకున్నారు. పార్టీ పట్ల నిబద్దత,  విలువలను పాటిస్తూ పని చేసి నాయకుడని తెలిపారు. చివరి సారిగా ఆయన  కలిసిన సమయంలో కూడా రాజకీయ అంశాలపై చర్చించామని చెబుతూ మంత్రి స్థాయికి ఎదిగినా ఎప్పుడూ సామాన్య కార్యకర్తగానే పార్టీలో పని చేశారని తెలిపారు.

ఎపీలో అనేక ఆటుపోటులు ఎదుర్కొని మాణిక్యాలరావు  బీజేపీ కోసం పని చేశారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరరావు కొనియాడారు. మంత్రి పదవి కన్నా విలువలే మఖ్యమని, రాజీనామాకు కూడా సిద్దమని ప్రకటించిన నాయకుడని గుర్తు చేశారు. బీజేపీ కార్యకర్త ఎలా ఉండాలా అని చెప్పేందుకు మాణిక్యాలరావు జీవితాన్ని ఉదహరించాలని చెప్పారు.

బీజేపీ ని ఎపీలో అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా ఆయన పని చేశారని చెబుతూ అనేక రాష్ట్రాలలో బీజేపీ బలపడుతున్న విధంగా అదే విజయాన్ని ఎపీలో కూడా సాధించాలని ఆయన భావించారని పేర్కొన్నారు. అది సాధించడం ద్వారానే ఎపీలో గ్రామ స్థాయిలో ఉండే చివరి కార్యకర్త కూడా మాణిక్యాలరావుగారికి శ్రద్దాంజలి ఘటిస్తూ ఆయన ఆశయాల సాధన కోసం కృషి చేయాలని సూచించారు.

మాణిక్యాలరావు పార్టీలో కీలకపాత్ర, చురకైన పాత్ర పోషించే వారని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి చెప్పారు. చిన్న రాష్ట్రాల ద్వారానే అభివృద్ది జరుగుతుందని మాణిక్యాలరావు చెబుతుండే వారని అంటూ మాణిక్యాలరావు జీవితాన్ని నేటి రాజకీయ నాయకులు ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. 

 
ఆర్ ఎస్ ఎస్ సహా సర్ కార్యవాహ వి భాగయ్య, బిజెపి ప్రధాన కార్యదర్శి జివిఎల్ నరసింహారావు, బిజెపి జాతీయ కార్యదర్శి సునీల్ దేవధర్, మాజీ కేంద్ర మంత్రి పురందేశ్వరి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్యమూర్తి తదితరులు కూడా పాల్గొన్నారు.