అరుదైన జన నేతల నిష్క్రమణ 

ఒక వంక  ఉత్తర ఆంధ్రాలో జానపద కళాకారుడు, ‘వంగపండు ప్రసాదరావు’, మరోవంక తెలంగాణలో, భద్రాచలం మాజీ ఎమ్మెల్యే ‘సున్నం రాజయ్య’, ఒకే రోజు చనిపోయారు.

వాళ్లిద్దరూ చెప్పిన వామపక్ష భావజాలాన్ని మనం ఎంతవరకు ఒప్పుకొంటామా లేదా అనే విషయాన్ని పక్కన పెడితే, ఇద్దరూ ప్రజల కోసం పోరాడిన వాళ్ళు. అతి సామాన్యులుగా. పుట్టుకతో వాళ్లిద్దరూ, అతి సామాన్యులే, వారు ఎంచుకున్న రంగాలు కూడా ప్రజలతో మమేకమై వారి సమస్యల పై గొంతెత్తి నినదీసే రంగమే.

ఇద్దరికీ ఎంత పేరొచ్చినా కూడా, సున్నం రాజయ్య ఎమ్మెల్యే అయినా,  వంగపండు సెలెబ్రేటెడ్ జానపద కళాకారుడు గా ఎదిగిన తర్వాత కూడా, ‘డబ్బు’ అనేది వారి దరిచేరలేదు. వారు డబ్బు ని, అవినీతిమార్గంలో దరిచేరనీయలేదు అంటే నిజమేమో.!

మిగిలిన పార్టీల ఎమ్మెల్యే లు, గెలుపుగతి పక్కన బెట్టి, ఒకసారి పోటీ చేస్తే చాలు, మేము ఆ ప్రాంతానికి ఇక నుంచి రాజులం అనే సమయంలో, ఇక గెలిచి ఎమ్మెల్యే అయితే, ఆ ప్రాంతం, ఎమ్మెల్యే సామంత రాజ్యం అనుకొనే ఈ రోజుల్లో, మూడు సార్లు ఎమ్మెల్యే అయ్యి కూడా సున్నం రాజయ్య సంపాదించింది ఒక్క పైసా కూడా లేదు, తన జీతం తప్ప, అది కూడా  కొంత పార్టీకి ఇచ్చే వాడట. అసెంబ్లీకి ఆటోలోనే, సిటీ బస్సు లోనే వెళ్లేవారు.

ఇక వంగపండు కొన్ని సంవత్సరాలుగా జానపద కళారూపాలు వింటూనే ఉన్నాము. ప్రజా నాట్యమండలి ద్వారా కూడా. ఎవరో, ఏదో పెడతారు, ఎక్కడో ఆ రోజు గడిచి పోతుంది, కానీ ఈ జానపద కళారూపాలు మాత్రం నాతోనే వుంటుంది, అనే మనిషి.

రోజుకోకసారి అభిప్రాయాలు మార్చుకొంటున్న ఈ రోజుల్లో, నిజంగా కొంత సేవా భావం ఉన్న వారు కూడా, ముందు తన కుటుంబం, తన మీద ఆధార పడిన వారు, ఆ తర్వాత కుదిరితే , ఓపికుంటే ప్రజలు అని అనుకొనే ఈ రోజుల్లో…ఆడంబరంగా వుండే ఎమ్మెల్యేలు, ఇతర కళాకారుల మధ్యన, . జీవితాంతం అతి నిరాడంబరంగా కూడా జీవించచ్చు అని నిరూపించిన వీరిద్దరూ చిరస్మరణీయులు.

సమాజంలో మిళితమై, ప్రజల కోసం జీవిస్తూ, అతి సాధారణ జీవనం గడిపిన ఇటువంటి అరుదైన వారు మన రాజకీయ రంగంలో దాదాపు అంతరించి పోతున్నారు.