భారత రవాణా వ్యవస్థలో త్వరలోనే ప్రైవేట్ రైళ్లు కూత పెట్టనున్నాయి. రైల్వేల్లో ప్రైవేట్ భాగస్వామ్యానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 12 క్లస్టర్లలో, 109 రూట్లలో 151 ప్రైవేటు రైళ్లు నడువనున్నాయి. రైల్వేలను నష్టాల నుంచి బయటపడేయటంతోపాటు ప్రయాణికులకు మెరుగైన సేవలకు ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ) విధానంలో ఎంపిక చేసిన రద్దీ రూట్లలో ప్రైవేట్ రైళ్లు నడుపాలని నిర్ణయించింది.
అందుకు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌నర్ షిప్ అప్రైజల్ కమిటీ ఆమోదం కూడా తెలిపింది. ఈ విధానం లో రూ.30వేల కోట్ల పెట్టుబడుల సమీకరణ లక్ష్యంగా నిర్ణయించింది. ఇటీవలే ప్రైవేట్ ఆపరేటర్ల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. మొదట గుజరాత్‌లోని పలనాపూర్ నుంచి హర్యానాలోని రేవార్ మధ్య 650 కిమీ మార్గంలో ప్రైవేట్ రైళ్లు ప్రవేశపెడుతారు.
క్రమక్రమంగా దేశవ్యాప్తంగా 12 క్లస్టర్లకు ఆ సేవలను విస్తరింపజేయాలని ప్రణాళికలను రూపొందించారు. జూలై 1న కంపెనీల నుంచి అర్హతల అభ్యర్థన స్వీకరించారు. అక్టోబర్-నవంబర్ మధ్య అర్హమైన కంపెనీల షార్ట్ లిస్టు తయారు చేసి 2021 ఏప్రిల్ నాటికి కంపెనీలకు కాంట్రాక్టును అప్పగిస్తారు. 2023 ఏప్రిల్ నాటికి ప్రైవేట్ రైళ్ల సేవలు ప్రారంభం కానున్నాయి.
ప్రైవేటీకరించిన రూట్లతోపాటు వాటితో అనుసంధానించిన సుమారు 50 ప్రధాన రైల్వే స్టేషన్ల నిర్వహణనూ ప్రైవేట్ కంపెనీలకు అప్పగిస్తారు. 35 ఏండ్లు ఆ స్టేషన్లను ప్రైవేట్ కంపెనీలే నిర్వహిస్తాయి. ఇక ఈ రైళ్లు నడిపే డ్రైవర్లు, గార్డులను రైల్వే బోర్డు నియమిస్తుంది. టిక్కెట్ చార్జీలు, తనిఖీలు, రైళ్ల నిర్వహణ, క్యాటరింగ్ తదితర సర్వీసులను మాత్రం కంపెనీలే చూసుకుంటాయి. వీటిపై రైల్వే బోర్డు పర్యవేక్షణ ఉంటుంది. నియమాలు ఉల్లంఘిస్తే అనుమతులను రద్దు చేస్తారు.
రైల్వే సర్వీసుల నిర్వహణకు బహుళజాతి సంస్థలతోపాటు ప్రైవేట్ కంపెనీలు భారీగా పోటీపడుతున్నాయి. జీఎంఆర్, బొంబార్డియర్ ట్రాన్స్‌పోర్టేషన్, స్టెరిలైట్ పవర్, మేధా, భారత్ ఫోర్జీ, ఐఆర్‌సీటీసీ, సీఏఎఫ్ ఇండియా, భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (బీహెచ్‌ఈఎల్), మేఘా ఇంజినీరింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, ఐబోర్డ్ ఇండియా, జేకేబీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్, హింద్ రెక్టిఫైర్స్, టిటగర్హ్ వ్యాగర్, గేట్‌వే రైల్, జాసన్ ఇన్‌ఫ్రా, ఆర్‌కే అసోసియేట్ అండ్ హోటలైర్ వంటి కంపెనీలు రైళ్లు నడిపేందుకు ఆసక్తి చూపుతున్నాయి.
దక్షిణాదిన…
సికింద్రాబాద్: సికింద్రాబాద్-శ్రీకాకుళం వయా విశాఖపట్నం, తిరుపతి, గుంటూర్, కర్నూల్-గుంటూర్, తిరుపతి- వారణాసి వయా సికింద్రాబాద్, ముంబై, ఔరంగాబాద్-ముంబాయి, విశాఖపట్నం- విజయవాడ, విశాఖ-బెంగుళూర్ వయా రేణిగుంట, హౌరా
చెన్నై: చెన్నై-మధురై, ముంబై, మంగళూర్, పుదుచ్చేరి వయా సికింద్రాబాద్, కోయంబత్తూర్, తిరునల్‌వేలి, తిరుచూరాపల్లి, కన్యాకుమారి, ఎర్నాకులం-కన్యాకుమారి, చెన్నై-ఢిల్లీ, కొచువేలి-గుహవాటి, తిరునల్వేలి-కోయంబత్తూర్
బెంగుళూర్: బెంగుళూర్-గుహవాటి వయా ధర్మవరం, మైసూర్-భువనేశ్వర్, ఢిల్లీ, హౌరా, రాంచి
More Stories
తుది దశకు చేరుకున్న వామపక్ష తీవ్రవాదం
ఆప్ ఎంపీ సంజీవ్ అరోరా ఇంట్లో ఈడీ సోదాలు
ఇజ్రాయెల్- హమాస్ మధ్య పోరుకు ఏడాది పూర్తి