రామాలయం భూమిపూజకు అంకురార్పణ  

రామాలయం భూమిపూజకు అంకురార్పణ  
అయోధ్యలో శ్రీరాముడి దివ్యాలయ నిర్మాణానికి సోమవారం భూమిపూజ క్రతువు ప్రారంభమైంది. ఉదయం 9.30 గంటలకు వేదపండితులు గౌరీ గణేష పూజతో భూమిపూజకు అంకురార్పణ చేశారు. రాముడికి 1985 నుంచి వస్త్రాలు  సమర్పిస్తున్న శంకర్‌లాల్‌, బన్వర్‌లాల్‌ సోదరులు బుధవారం భూమిపూజ సందర్భంగా ప్రత్యేక వస్త్రాలు  సిద్ధంచేశారు.
 
9 రత్నాలు పొదిగిన బంగారు దారాలతో ఆకుపచ్చ, గులాబీరంగు వస్ర్తాలను సిద్ధం చేశారు. రాముడికి ఒక్కో రోజు ఒక్కో రంగు వస్ర్తాలు అలంకరిస్తారు. సోమవారం తెలుపు, మంగళవారం ఎరుపు, బుధవారం ఆకుపచ్చ, గురువారం పసుపు, శుక్రవారం క్రీం, శనివారం నీలం, ఆదివారం గులాబీరంగు వస్ర్తాలు అలంకరిస్తారు. 
 
లక్ష్మణుడు, భరతుడు, శతృఘ్నుడు, హనుమంతుడు, శాలిగ్రామాలకూ ఇదే విధానం కొనసాగిస్తున్నారు. ఈ మూర్తుల వస్త్రాలకు 11 మీటర్ల వస్త్రం అవసరమని, ఇప్పుడు 17 మీటర్లు అవసరం అవుతుందని శంకర్‌లాల్‌ తెలిపారు.  వెండి తాంబూలం భూమిపూజ సందర్భంగా వారణాసికి చెందిన కాశి చౌరాసియా కమ్యూనిటీ అయోధ్య రాముడికి వెండి తాంబూలం పంపింది. 
 
వెండితో తయారుచేసిన 5 తమలపాకులతో ఈ తాంబూలం తయారుచేసినట్టు చౌరాసియా సంఘం అధ్యక్షుడు నాగేశ్వర్‌ చౌరాసియా తెలిపారు. అహ్మదాబాద్‌ జైన సన్యాసులు 25కిలోల వెండి ఇటుక సమర్పించారు. 
 
కాగా, అయోధ్య వివాదంలో బాబ్రీ మసీదు కోసం సుదీర్ఘ న్యాయపోరాటం చేసిన ఇక్బాల్‌ అన్సారీకీ భూమిపూజకోసం శ్రీరామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు ఆహ్వానం పంపింది. కార్యక్రమానికి తాను తప్పకుండా వెళ్తానని, ప్రధాని మోదీకి రామ్‌చరిత్‌మానస్‌ బహూకరిస్తానని అన్సారీ చెప్పారు. 
 
ఇలా ఉండగా, అయోధ్యలో రామందిర నిర్మాణ భూమి పూజలో పాల్గొనాలని విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతీ స్వామిలకు విశ్వ హిందూ పరిషత్‌ జాతీయ సంయుక్త ప్రధాన కార్యదర్శులు రాఘవులు, కోటేశ్వరశర్మ ఫోన్‌ చేసి ఆహ్వానించారు.చాతుర్మాస్య దీక్ష కోసం రిషికేష్‌లో ఉన్నందున తర్వాత అయోధ్యను సందర్శిస్తానని  స్వామి స్వరూపానందేంద్ర పేర్కొన్నారు.