సుశాంత్‌ సింగ్  మృతిపై సిబిఐ దర్యాప్తు: నితీష్ 

బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్ రాజ్‌పుత్‌ ఆత్మహత్య కేసులో సీబీఐ విచారణ జరపాలని బీహార్‌‌ ప్రభుత్వం కోరింది. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేస్తామని బీహార్‌‌ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌‌ మంగళవారం ప్రకటించారు. 
 
ఈ విషయమై సిబిఐ దర్యాప్తు జరపాలని పలువురు కోరుతున్నా మహారాష్ట్ర ప్రభుత్వం తిరస్కరిస్తూ,  మహారష్ట్ర పోలీసులు దర్యాప్తు జరుపుతారని చెబుతున్నది. ప్రస్తుతం రెండు రాష్ట్రాల పోలీసులు జరుపుతూ ఉండడంతో ఈ కేసు రెండు రాష్ట్రాల మధ్య వివాదంగా మారుతున్నది. 
 
సుశాంత్‌ తండ్రి కృష్ణ కుమార్‌‌ బీహార్‌‌ సీఎం నితీశ్‌ కుమార్‌ని కలిసి విచారణ చేపట్టాలని కోరారు. ఈ మేరకు కేసును సీబీఐకి అప్పగించాలని నిర్ణయించినట్లు జేడీయూ అధికార ప్రతినిధి సంజయ్‌ సింగ్‌ చెప్పారు. కుటుంబసభ్యులు కోరినందుకే కేసును సీబీఐకి అప్పగించాలని ప్రతిపాదించామని నితీశ్‌  స్పష్టం చేశారు. 
 
సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మరణం మొదటి నుంచి ఒక మిస్టరీగానే ఉండిపోయింది. దీనిపై పలు వాదనలు వినిపిస్తున్నాయి. సుశాంత్‌ కేసులో ముంబై పోలీసులు ఎఫ్‌ఐఆర్‌‌ నమోదు చేయకపోవడంతో బీహార్‌‌ పోలీసులు పాట్నాలో ఎఫ్‌ఐఆర్‌‌ ఫైల్‌ చేశారు. 
 
విచారణ కోసం పాట్నా పోలీసులు ముంబైలో దర్యాప్తు మొదలుపెట్టారు. రియాపై అనుమానాలు ఉన్నాయని, ఆయన తండ్రి ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో భాగంగా గత ఆదివారం రాత్రి ముంబైకి వెళ్లిన బీహార్ ఐపీఎస్ అధికారి విన‌య్ తివారీని బలవంతంగా క్వారంటైన్ చేయడం వివాదంగా మారింది.
దీంతో సోమవారం బీహార్‌ అసెంబ్లీలో అన్ని పార్టీల ఎమ్మెల్యేలూ ఈ కేసులో సీబీఐ విచారణ కోసం డిమాండ్ చేశారు. ముంబైలోని బాంద్రాలోని త‌న ఇంట్లో సుశాంత్ జూన్ 14వ తేదీన ఆత్మ‌హ‌త్య చేసుకున్న విష‌యం తెలిసిందే.