ఛత్తీస్ గడ్ లో రామ్ వనగ్మాన్ పథ్ ప్రాజెక్టు

అయోధ్యలో రామాలయం నిర్మాణానికి ఉత్తర్వులు జారీ చేసిన తరువాత ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం కూడా రామ్ వనగ్మాన్ మార్గం చేపట్టాలని భావిస్తున్నది. ఈ ప్రాజెక్టులో రాష్ట్రంలోని ముఖ్యమైన ప్రదేశాలను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. 

అరణ్యవాసం సమయంలో శ్రీరాముడు ఛత్తీస్ గఢ్లోని 75 ప్రదేశాలను సందర్శించి దాదాపు 51 ప్రదేశాల్లో కొంత సమయం గడిపారని చరిత్ర చెబుతున్నది. రాముడు నడయాడిన అటవీ ప్రదేశాలను అభివృద్ధి చేసి వనగ్మాన్ గా తీర్చిదిద్దనున్నారు.

ఛత్తీస్‌గఢ్‌లో రామాయణ సంస్కృతి నేటికీ కనిపిస్తుంది. శ్రీ రాముడు కాకుండా సీతదేవి, ఆయన కుమారులు లవ-కుశలు ఈ ప్రాంతానికి సంబంధించినవారని రుజువులు ఎన్నో ఉన్నాయి. దట్టమైన అడవుల మధ్య ఉన్న మాతా గర్ తుర్తురియా వద్ద మహర్షి వాల్మీకి ఆశ్రమం ఉండేదంట. 

తుర్తురియా సిర్పూర్-కాస్డోల్ రహదారిపై ఠాకుర్డియా స్థలం నుంచి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్నది. తుర్తురియా మాతాగఢ్ ప్రాంతం లావన్ రేంజ్ పరిధిలోకి వస్తుంది. వాల్మీకి ఆశ్రమంలోనే గుర్రంపై నిలబడి ఉన్న లవకుశల విగ్రహం ఉంది. 

ఉత్తరాన ఉత్తరప్రదేశ్-మధ్యప్రదేశ్ సరిహద్దులోని సీతామఢి హర్ చౌక్ నుంచి రామ్ గఢ్, శివరీ నారాయణ్, తుర్తురియా, చంద్ ఖురి, రాజిమ్, సిహావా, జగదల్ పూర్ మీదుగా తెలంగాణ సరిహద్దులోని రామారామ్ (సుక్మా) వరకు పర్యాటక ప్రాజెక్టును అధికారులు సిద్ధం చేశారు. త్వరలోనే కేబినెట్ లో చర్చించి ఈ ప్రాజెక్టును చేపట్టాలని ఛత్తీస్ గఢ్ ప్రభుత్వం భావిస్తున్నది.