దళిత్ లపై కేసీఆర్ పాలనలో అంతులేని దాడులు 

తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ నాయకత్వంలోని  టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దళితులపై జరుగుతున్న దాడులను బిజెపి తీవ్రంగా ఖండిస్తోంది. రాష్ట్రంలో ప్రతిరోజూ ఎక్కడో ఒక చోట దళితులపై దాడులు జరుగుతూనే ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. స్వయంగా సీఎం కేసీఆర్ సొంత నియోజకవర్గంలోని వేలూరు గ్రామంలో బ్యాగరి నర్సింహులు అనే దళిత రైతు ఆత్మహత్య చేసుకోవడం పట్ల దిగ్బ్రాంతి వ్యక్తం చేసింది. 
 
దళితులు, గిరిజనులపై ప్రతిరోజు హింసాకాండ జరుగుతోందని చెబుతూ  జడ్చర్ల, వరంగల్ జిల్లాలో దళితులపై జరిగిన దాడులు ఇందుకు నిదర్శనమని  మాజీ  మంత్రి డాక్టర్ విజయ రామారావు, బిజెపి  రాష్ట్ర  అధికార  ప్రతినిధి  డాక్టర్  ప్రకాష్ రెడ్డి గుర్తు చేశారు. కేవలం వారం వ్యవధిలోనే దళితులపై ఇన్ని సంఘనలు  జరగడం దారుణమని ధ్వజమెత్తారు. 
 
రాష్ట్ర ప్రభుత్వం అణగారిన వర్గాలపై వ్యవహరిస్తోన్న తీరు అమానుషమని పేర్కొంటూ టీఆర్ఎస్ ప్రభుత్వం దళిత వ్యతిరేక ప్రభుత్వంగా వ్యవహరిస్తోందని వారు విమర్శించారు. అటు దళితులపై దాడికి సంబంధించి  నేరెళ్ల ఘటన ఇంకా సలుపుతూనే ఉంది. రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు దళితులపై ‘థర్డ్‌డిగ్రీ’ ప్రయోగించిన ఘటన మానని గాయంగానే మిగిలిందని పేర్కొన్నారు. 
 
దళితుల పట్ల వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న  టీఆర్ఎస్ సర్కారుకు వ్యతిరేకంగా, దళితుల పక్షాన ముందునుంచి  బిజెపి పోరాడుతూనే ఉందని వారు తెలిపారు.  తాజాగా  జరిగిన గజ్వేల్ నియోజకవర్గంలో నర్సింహులు  ఆత్మహత్యకు  భూవివాదమే  కారణమైనా.. రాష్ట్ర  ప్రభుత్వం బాధ్యులపైనా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం పట్ల నిరసన వ్యక్తం చేశారు. 
 
నర్సింహులుకు చెందిన 13 గుంటల భూమిని లాక్కుంటున్నందుకే చచ్చిపోతున్నానని వీడియో తీసి మరీ ఆత్మహత్య చేసుకోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. దళితులకు ఉచితంగా 3 ఎకరాల వ్యవసాయ భూమి ఇస్తానన్న సీఎం, ఉన్న భూమిని కూడా లాక్కోవాలని ప్రయత్నించడం దుర్మార్గమని బిజెపి నేతలు మండిపడ్డారు. 
 
జడ్చర్చ రాజాపూర్ లో జరిగిన సంఘటన కూడా ఒకరకంగా హత్యగానే బిజెపి అనుమానిస్తోంది.  దీనికి కారణం ఇసుకవ్యాపారమే. అందుకోసం ఈ సంఘటనపై పూర్తిస్థాయి విచారణ జరగాలని బిజెపి డిమాండ్  చేస్తోంది. ఈ దాడుల విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోకపోతే.. దళితుల పక్షాన బిజెపి రాష్ట్ర పార్టీ ఉద్యమించేందుకు సిద్ధమవుతోందని బిజెపి నేతలు హెచ్చరించారు.