పోతిరెడ్డిపాడు విస్తరణ పనులు ఆపండి

వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం  తలపెట్టిన పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ విస్తరణ, సంగమేశ్వరం (రాయలసీమ) లిఫ్ట్ స్కీంలను ఆపాలంటూ కృష్ణానది యాజమాన్యబోర్డు ఆదేశించింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వానికి  వరుసగా మూడో సారి ఆ దేశాలు జారీ చేసింది. ఇప్పటికే రెండు సార్లు బోర్డు ఇచ్చిన ఆదేశాలను తేలికగా తీసుకున్న జగన్ ప్రభుత్వం ఏకంగా ప్రాజెక్టుల టెండర్ల ప్రక్రియనూ వేగవంతం చేసింది.

మరో 20 రోజుల్లో ఈ పక్రియను పూర్తి చేసి పనులు మొదలు పెట్టాలన్న పట్టుదలతో ఏపీ ప్రభుత్వం ముందుకువెళ్తోంది. సంగమేశ్వరం (రాయలసీమ) లిఫ్ట్​ స్కీంకు అపెక్స్ కౌన్సిల్ ఆమోదం పొందే వరకూ ప్రాజెక్టు విషయంలో ముందుకెళ్లొద్దని ఏపీ ప్రభుత్వాన్ని  కృష్ణా బోర్డు ఆదేశించింది. బోర్డు, సీడబ్ల్ యూసీ టెక్నికల్ అప్రైజల్, అపెక్స్ కౌన్సిల్ ఆమోదం పొందే వరకూ పనులపై ముందుకెళ్లొద్దని గతంలోనే ఆదేశించామని గుర్తు చేసింది.

ఏపీ రీఆర్గనైజేషన్ చట్టంను అతిక్రమించి నిర్మిస్తున్న ప్రాజెక్టులకు కౌన్సిల్ ఆమోదం తప్పనిసరని స్పష్టం చేసింది. తమ ఆదేశాలను అతిక్రమించి ఏపీ సర్కారు టెండర్ల ప్రక్రియ చేపట్టిందని తప్పుపట్టింది. పోతిరెడ్డిపాడు, సంగమేశ్వరం లిఫ్ట్ స్కీంలను ఆపాలంటూ కృష్ణా బోర్డు ఏపీ సర్కారును ఆదేశించడం ఇది మూడోసారి.

జూన్ 4న నిర్వహించిన కృష్ణా బోర్డు 12వ సమావేశంలో మొదటిసారి ఆదేశాలు ఇచ్చింది. జూలై 1న ఏపీ ప్రభుత్వానికి  మరోసారి లేఖ  రాసింది. కానీ బోర్డు ఆదేశాలను ఏపీ తేలికగా  తీసుకుంది. ఈ ప్రాజెక్టుల డీపీఆర్ లు ఇవ్వాలంటూ ఆదేశించినా పట్టిం చుకోలేదు. పోతిరెడ్డిపాడు సామర్ధ్యం పెంచడంతో పాటు సంగమేశ్వరం లిఫ్టు డీపీఆర్ లు ఇవ్వాలని బోర్డు గతంలో ఏపీని కోరింది.

అయితే బదులుగా లెటర్ రాసిన ఏపీ.. పోతిరెడ్డిపాడు, సంగమేశ్వరం ప్రస్తావ కూడా లేకుండానే మిగతా ప్రాజెక్టుల విషయాలతో సరిపెట్టింది. కొత్త ప్రాజెక్టులపై టెండర్ల వరకు వెళ్లినా ఆ పత్రాలను  కూడా బోర్డుకు అందించేందుకు ముందుకు రాలేదు. కృష్ణా బోర్డుకు నిర్దిష్ట అధికార పరిధి (జ్యూరిస్డిక్షన్ ) లేకపోవడంతోనే ఏపీ తేలికగా  తీసుకుంటోందన్న అభిప్రాయం ఉంది.

శ్రీశైలం ప్రాజెక్టులోకి చేరే ప్రతి నీటి చుక్కను రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు మళ్లించుకునేలా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులే టర్ విస్తరణ, సంగమేశ్వరం లిఫ్ట్ స్కీంలను ప్రతిపాదించిందని తెలంగాణ ప్రభుత్వం ఆరోపిస్తున్నది. గత డిసెంబర్ లోనే ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలపై విధాన పరమైన నిర్ణయం తీసుకుంది. జగన్  రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లోనే ఈ విషయం వెల్లడించారు.

ఈ ప్రాజెక్ట్ ల కారణంగా దక్షిణ తెలంగాణ ప్రాంతం ఎడారిగా మారుతుందని అక్కడి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై సుప్రీం కోర్ట్ కు వెడతామని ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్ మౌనం వహిస్తున్నారు. అయితే ఆ ప్రాంత రైతులే చొరవ తీసుకొని ఎన్జీటీలో పిటిషన్ వేయడంతో గ్రీన్ ట్రిబ్యు నల్ స్టే ఇచ్చింది. వాటి పనులకు రెండు నెలల పాటు బ్రేక్ పడింది.