మూడు రాజధానుల బిల్లుకు గవర్నర్‌ ఆమోదం

మూడు రాజధానుల బిల్లుకు గవర్నర్‌ ఆమోదం
ఏపీ రాజకీయాలలో తీవ్ర ఉత్కంఠతకు దారితీసిన సీఆర్‌డీఏ-2014 రద్దు, వికేంద్రీకరణ-ప్రాంతీయ సమానాభివృద్ధి బిల్లు, పాలనా వికేంద్రీకరణ బిల్లులకు గవర్నర్‌ బిశ్వభూషన్‌ హరిచందన్‌ ఆమోదం తెలిపారు. రాష్ట్ర శాసనసభను ఆమోదం తెలిపి బిల్లును పరిశీలించిన గవర్నర్‌ తన ఆమోద ముద్రవేశారు. మూడు వారల క్రితం ఈ బిల్ లను వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం గవర్నర్ ఆమోదం కోసం పంపింది.

తాజా నిర్ణయంతో ఇకపై పరిపాలనా రాజధానిగా విశాఖపట్నం, శాసన రాజధానిగా అమరావతి, న్యాయ రాజధానిగా కర్నూలు గుర్తింపు పొందనున్నాయి.  పరిపాలనా వికేంద్రీకరణను దృష్టిలో ఉంచుకుని మూడు రాజధానులను ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయించిన విషయం తెలిసిందే. 

 రాజధానిపై సలహాలు, సూచనల కొరకు 2019 సెప్టెంబర్‌ 13న రిటైర్డ్‌ ఐఏఎస్‌ జీఎన్‌ రావు కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మూడు నెలల పాటు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించిన కమిటీ  2019 డిసెంబర్‌ 20న తన నివేదికన సమర్పించింది. మూడు ప్రాంతాల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని పరిపాలనా వికేంద్రీకరణకు కమిటీ సిఫార్సు చేసింది. 

కమిటీ సమర్పించిన నివేదిక పరిశీలన కొరకు 2019 డిసెంబర్‌ 29న రాష్ట్రం హైపవర్‌ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ క్రమంలోనే 2020 జనవరి 3న బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ తన నివేదికను సమర్పించింది. రెండు కమిటీల నివేదికలపై హైపవర్‌ కమిటీ సుదీర్ఘంగా చర్చించింది.

అనంతరం 2020 జనవరి 20న హైపవర్‌ కమిటీ నివేదికపై మంత్రిమండలి చర్చించింది. 2020 జనవరి 20న బిల్లును అసెంబ్లీ ఆమోదించింది. దీనిలో భాగంగానే 2020 జనవరి 22న శాసనమండలి ముందుకు బిల్లును తీసుకురాగా ప్రతిపక్ష టీడీపీ వ్యతిరేకించింది. 

దాని తరువాత న్యాయ నిపుణుల సలహా మేరకు 2020 జూన్‌ 16న రెండోసారి వికేంద్రీకరణ బిల్లుకు అసెంబ్లీలో ఆమోదం లభించింది. తాజాగా ఈ బిల్లుకు గవర్నర్‌ రాజ ముద్రవేయడంతో ప్రభుత్వ నిర్ణయం అమల్లోకి రావడానికి మార్గం సుగమమైనది.