మారిషస్ సుప్రీంకోర్టు భవనంకు ప్రారంభం 

మారిషస్ సుప్రీంకోర్టు భవనంకు ప్రారంభం 
మారిషస్ కొత్త సుప్రీంకోర్టు భవనాన్ని భార‌త‌ ప్రధాని నరేంద్ర మోడీ, మారిషస్ ప్రధాని ప్రవీంద్ జుగ్నాత్ సంయుక్తంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గురువారం ప్రారంభించారు. ఇరు దేశాల స్వతంత్ర న్యాయవ్యవస్థలు మన ప్రజాస్వామ్య వ్యవస్థలకు ముఖ్యమైన స్తంభాల‌ని మోదీ ఈ సంద‌ర్భంగా పేర్కొన్నారు. 

ఆధునిక డిజైన్,  నిర్మాణంతో ఆకట్టుకునే ఈ కొత్త భవనం ఈ గౌరవానికి గుర్తు అని తెలిపారు. భార‌త్‌, మారిష‌స్ మ‌ధ్య అభివృద్ధి, సహకారం ఎటువంటి షరతులతో కూడిన‌ది కాద‌ని స్పష్టం చేశారు. హిందూ మహా సముద్రం ప్రాంతాల అభివృద్ధి విధాన‌మైన ‘సాగర్ – సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ రీజియన్’ గురించి తొలుత మారిష‌స్‌తోనే మాట్లాడిన‌ట్లు గుర్తు చేశారు. క‌రోనాను సమర్థవంతంగా నియంత్రిస్తున్న మారిషస్ ప్రభుత్వం, ఆ దేశ ప్ర‌జ‌ల‌ను అభినందిస్తున్న‌ట్లు మోదీ తెలిపారు.

2016లో ప్రధాని మోదీ ప్రకటించిన 353 మిలియన్ అమెరికా డాలర్ల విలువ గల ప్రత్యేక ఆర్ధిక ప్యాకేజి క్రింద చేపట్టనున్న ఐదు ప్రాజెక్ట్ లలో ఇదొక్కటి. 4,700 చ.మీటర్ల కు పైగా విస్తీర్ణంలో, 10 అంతస్థులతో 25,000 చ. మీటర్లలో ఈ భవన సముదాయాన్ని నిర్మించారు. ఆ దేశంలో మెట్రో ఎక్స్ప్రెస్ ప్రాజెక్ట్ మొదటి దశ, ఇ ఎన్ టి ఆసుపత్రులను ఈ ప్రధానులు ఇద్దరు గత డిసెంబర్ లో  ప్రారంభించారు.

మ‌రోవైపు త‌మ దేశ సుప్రీంకోర్టు కొత్త భ‌వ‌నం నిర్మాణానికి స‌హ‌క‌రించిన భార‌త్‌కు మారిష‌స్ ప్ర‌ధాని ప్ర‌వీంద్ జుగ్నాత్ ధ‌న్య‌వాదాలు తెలిపారు. మోదీజీని త‌మ దేశం, త‌మ ప్ర‌జ‌లు ఎల్ల‌ప్పుడు గుర్తు చేసుకుంటార‌ని  హిందీలో అన్నారు. భార‌త ప్ర‌భుత్వ స‌హ‌కారం `స‌బ్ కా సాథ్‌, స‌బ్ కా వికాస్‌, స‌బ్ కా విశ్వాస్` విలువ‌ల‌ను స‌మ‌ర్థిస్తున్నాయ‌ని ఆయ‌న కొనియాడారు.