కరోనా మరణాలు తక్కువచేసి చూపిస్తున్న కేసీఆర్ 

ఒక వంక కరోనా టెస్టులు సరిగ్గా జరుపకుండా, కరోనా రోగుల సంఖ్యను తక్కువ చేసి చోపిస్తున్న కేసీఆర్ ప్రభుత్వం కరోనాతో మరణించిన వారి సంఖ్యను సహితం చాలా తక్కువచేసి చూపిస్తున్నది. ప్రభుత్వం చెబుతున్న లెక్కలకన్నా రెండు రేట్లు ఎక్కువ మందే  కరొనతో చనిపాయిన్నట్లు తెలుస్తున్నది. 

‘‘ఎప్పటి నుంచో జబ్బులున్నోళ్లు కరోనా బారిన పడి చనిపోతే. ఆ మరణాలను కరోనా లెక్కల్లో చేర్చేది లేదు’’ అంటూ  ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ చేసిన ప్రకటన కేసీఆర్ ప్రభుత్వం కరోనా మరణాలను తగ్గించి చూపే ప్రయత్నం చేస్తున్నట్లు వెల్లడి చేస్తుంది. 

అందుకనే హెల్త్ బులెటిన్ లో చూపిస్తున్నలెక్కలకు, ఆస్పత్రుల్లో చనిపోతున్న వారి లెక్కలకు అసలు పొంతన కుదరట్లేదు. శ్మశానాల్లో కాలుతున్న శవాలు, ఆస్పత్రుల్లోని రికార్డులు అసలు నిజాలను బయటపెడుతున్నాయి. ఇప్పటిదాకా 480 మందే కరోనాతో చనిపోయారని బులెటిన్లో జులై 27 ఆరోగ్య శాఖ ప్రకటించింది. 

కానీ, ఈ మూడు నెలల్లో కొవిడ్ స్పెషల్ హాస్పిటల్ గా ప్రకటించిన ఒక్క గాంధీ ఆస్పత్రిలోనే 905 మంది చనిపోయారు. కరోనా విషయంలో కేసీఆర్ ప్రభుత్వం ఇంతటి గోప్యత ఎందుకు పాటించవలసి వస్తున్నదో అర్ధం కావడం లేదు.

ఏప్రిల్లోనే గాంధీని కొవిడ్ స్పెషల్ హాస్పిటల్ అని ప్రభుత్వం ప్రకటించింది.  అప్పటి నుంచి కరోనా రోగులను మాత్రమే ఆస్పత్రిలో చేర్పించుకుంటున్నారు. దీని ప్రకారం మే నుంచి జులై వరకు గాంధీలో చనిపోయినోళ్లంతా కరోనా వల్ల ఆరోగ్యం ఖరాబైన వాళ్లేన‌ని డాక్ట‌ర్లు అంగీకరిస్తున్నారు. 

ఇటు ఉస్మానియా ఆస్పత్రిలో 3 నెలల్లో 1,718 మంది చనిపోతే అందులో 300 మంది దాకా శ్వాస సమస్యలతోనే చనిపోయారని డాక్టర్లు చెబుతున్నారు. వాటికి తోడు హైదరాబాద్లోని చెస్ట్ హాస్పిటల్, కింగ్ కోఠి హాస్పిటల్, 30కిపైగా ప్రైవేట్ ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రుల్లో నమోదైన మరణాల సంఖ్య లెక్కలలోకి రావడం లేదు.