రామమందిరంపై ఓవైసీ చౌకబారు వ్యాఖ్యలు 

రామమందిర శంకుస్థాపనకు ప్రధాని మోదీ హాజరు కావడంపై ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ చేసిన వ్యాఖ్యలను బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ తీవ్రంగా ఖండించారు. 
 
ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల ఆరాధ్య దైవం శ్రీరాముడి జన్మభూమి అయోధ్యలో, భవ్య రామ మందిర నిర్మాణానికి ఏర్పాట్లు జరుగుతున్న తరుణంలో, ప్రధానిపై ఇలాంటి చవకబారు విమర్శలు చేయడం మంచిది కాదని  హితవు చెప్పారు.
 
ఓవైసీ చేసిన వ్యాఖ్యలు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నాయని సంజయ్ ధ్వజమెత్తారు. అన్ని మతాలను సమానంగా గౌరవించడమే సెక్యులరిజం అని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల ఆకాంక్ష మేరకు, ప్రధాని రామమందిర శంకుస్థాపనకు వస్తున్నారని  స్పష్టం చేశారు. 
 
ఈ ఆలయం కేవలం హిందువులకు చెందింది మాత్రమే కాదని, ఇది భారతీయుల ఆలయం అని తెలిపారు. కోట్లాది మంది ప్రజల ఆత్మ గౌరవానికి సంబంధించిన ఈ మహాయజ్ఞ ప్రారంభ కార్యక్రమంలో, ప్రధానిగా నరేంద్రమోదీ పాల్గొనడం, భారతీయులందరికీ గర్వకారణం అని సంజయ్‌ చెప్పారు. 
400 ఏళ్లుగా అయోధ్యలో ఉన్న బాబ్రీ మసీదు ఉంది అనడం నిజమైతే మరి అంతకుముందు వేల ఏళ్లుగా అక్కడ ఉన్న రామ మందిరాన్ని ఎవరు ధ్వంసం చేశారు? అని ప్రశ్నించారు.
సుప్రీంకోర్టు తీర్పు తర్వాత, భారత ప్రభుత్వం కోర్టుకు నివేదించిన మేరకు, ఎలాంటి సమస్యలు లేకుండా, అందరిని కలుపుకుంటూ, ఆమోదయోగ్యంగా, శాంతియుతంగా ఈ ఆలయ నిర్మాణం జరుగుతుందని గుర్తు చేశారు.