నిజనిర్ధారణకు వెళ్లిన బిజెపి నేతల అరెస్ట్ 

భూపాలపల్లి జిల్లా మల్లారం గ్రామంలోని లోని దళిత యువకుడు టిఆర్ఎస్  నాయకుల  చేతిలో  కావించబడినట్లు వచ్చిన వార్తలపై వాస్తవాలు తెలుసుకోవడానికి బయలుదేరిన బిజెపి నాయకులను తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. 
 
రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ నియమించిన వేసిన నిజ నిర్ధారణ కమిటీ  లో భాగంగా బయలుదేరిన మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు, బిజెపి శాసనమండలి పక్ష నాయకులు ఎన్.  రామ చందర్ రావు, బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు చింతా సాంబమూర్తి, జి. ప్రేమేందర్ రెడ్డి లను పరకాల పోలీస్ స్టేషన్ పరిధిలో ముందస్తుగా పోలీసులు అరెస్టు చేశారు.
 
అదేవిధంగా మాజీ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ వివేక్ వెంకటస్వామి, బిజెపి శాసన సభా పక్ష నాయకులు  రాజా సింగ్ తదితరులను రేగొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ముందస్తుగా అరెస్టు చేశారు. ఈ అరెస్ట్ లను బిజెపి తీవ్రంగా ఖండించింది. 
 
ప్రజాస్వామ్యంలో అన్యాయం జరిగితే విషయాలు తెలుసుకోవడం తగిన విధంగా న్యాయం జరిగేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడం రాజకీయ పార్టీలకు భారత రాజ్యాంగం కల్పించిన హక్క అని గుర్తు చేసింది. కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రంలో రాజకీయ పార్టీలకు ఉన్న హక్కులను, బాధ్యతలను హరించివేస్తుందని ధ్వజమెత్తింది. 
 
ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదని బిజెపి హితవు చెప్పింది. దీనిని ప్రజాస్వామ్య వాదులందరూ తీవ్రంగా ఖండించాలని కోరింది. ముందస్తు అరెస్టులు ఎందుకోసం చేస్తున్నదో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేసింది. ఈ అరెస్ట్ లు కేసీఆర్ నియంతృత్వ ధోరణిని వెల్లడి చేస్తున్నట్లు విమర్శించింది. 
 
తెలంగాణ రాష్ట్రం పోరాటాల ద్వారా ఉద్యమాల ద్వారా వచ్చిందన్న విషయాన్ని టిఆర్ఎస్ ప్రభుత్వం మరిచి పోయిందని విమర్శించింది. ప్రజల హక్కులను రాజకీయ పార్టీల బాధ్యతలను పూర్తిగా అడ్డుకొని రాష్ట్రప్రభుత్వ తప్పిదాలను ప్రజలకు తెలియకుండా చేయాలనే నిరంకుశ ధోరణి స్పష్టంగా కనిపిస్తున్నదని మండిపడింది. .