స్టార్టప్ కంపెనీలకు వారంలో రూ 1,000 కోట్లు 

రోనా మహమ్మారి సృష్టించిన ఆర్ధిక ఒడిదొడుకుల నుండి భారత్  స్టారప్ కంపెనీలు కోలుకొంటున్నాయి.  నిధుల సమీకరణలో తమ సత్తా చాటుతున్నాయి. గత వారం రోజుల్లోనే ఏకంగా రూ 1,000 కోట్ల ప్రైవేట్ ఈక్విటీ నిధులను ఆకర్షించాయి. సగటున ప్రతి వారం సుమారు రూ 1,000 కోట్ల నిధులను ఆకర్షిస్తూ సత్తా ఉన్న స్టార్టప్ సంస్థలకు నిధుల కొరత లేదని నిరూపిస్తున్నాయి. 

చైనా తో తెగదెంపులు చేసుకోవడం వల్ల నిధుల వేగం తగ్గే అవకాశం ఉంటుందని తొలుత ఆందోళన చెందారు. కానీ వారి అంచనాలను తోసిరాజని పెట్టుబడుల ప్రవాహం కొనసాగటం విశేషం. ఇదే స్పీడ్ కొనసాగితే మరిన్ని స్టార్టప్ సంస్థలకు నిధుల మద్దతు లభించనుంది. అమెరికా, చైనా తర్వాత భారత్ లోనే అత్యధిక సంఖ్యలో స్టార్టప్ కంపెనీలు ప్రారంభమవుతున్నాయి.

నిధుల వేటలో మాత్రం ఆ రెండు దేశాల కంటే వెనుకబడి ఉన్నప్పటికీ ఇప్పుడిప్పుడే భారతీయ స్టార్టప్ కంపెనీలు గ్లోబల్ స్థాయిలో పెట్టుబడులు రాబడుతున్నాయి. గతవారం రోజుల్లో మొత్తం15 కంపెనీలు పెట్టుబడులను ఆకర్షించాయి.

భారత్ లోని  ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీ కంపెనీ అథెర్ ఎనర్జీ సహా ఫిన్ టెక్ స్టార్టప్ ఇన్ క్రెడ్, జోడో, ఎంట్రీ, స్మార్టివిటీ, జిగ్ఫోర్స్, వి గ్రో, సీబ్రోస్, ఎంపవరెడ్, ఐ నర్చర్, స్టైల్ డాట్ మీ అనే సంస్థలు తమ పెట్టుబడుల వివరాలు వెల్లడించాయి.

స్నాక్ అమోర్, క్లౌడ్ వర్క్స్, ఫినిన్ వంటి కంపెనీలు మాత్రం తమ పెట్టుబడి వివరాలను వెల్లడించలేదు. మొత్తంగా అన్ని కంపెనీలు కలిసి 131 మిలియన్ డాలర్లు (సుమారు రూ 982 కోట్లు) పెట్టుబడిగా సమీకరించాయి.

వీటిలో అత్యధికంగా ఇన్ క్రెడ్ అనే కంపెనీ 66 మిలియన్ డాలర్ల పెట్టుబడిని రాబట్టింది. తర్వాత ఎంపవర్డ్ అనే కంపెనీ 21 మిలియన్ డాలర్ల పెట్టుబడిని ఆకర్షించగలిగింది. ఆన్ డిమాండ్ మాన్ పవర్ సేవలు అందించే హైదరాబాద్ కు చెందిన ఒక స్టార్టప్ కంపెనీ జిగ్ ఫోర్స్ కూడా తాజాగా నిధులు సమీకరించిన కంపెనీల జాబితా లో ఉండటం విశేషం.

ఈ కంపెనీకి యూనైటస్ వెంచర్స్ అనే ప్రైవేట్ ఈక్విటీ కంపెనీ రూ 60 కోట్ల పెట్టుబడిని అందించింది. దీంతో ఈ కంపెనీ మరింతగా తన సేవలను విస్తరించేందుకు మార్గం సుగమం అవుతుంది.

ఈ సారి నిధుల వేటలో కూడా ఎప్పటి లాగే ఫిన్ టెక్ కంపెనీలు అధికంగా పెట్టుబడులను ఆకర్షించాయి. ఆ తర్వాత అగ్రి టెక్ స్టార్టుప్ కంపెనీలు, ఎలక్ట్రిక్ టెక్ కంపెనీలు, ఫ్యాషన్ టెక్నాలజీ, మానవ వనరుల సేవల కంపెనీ ఇలా దాదాపు అన్ని రంగాలకు చెందిన స్టార్టప్ కంపెనీలు ఉన్నాయి.