వృద్ధిరేటు బలోపేతానికి ఎలాంటి చర్యలనైనా వెనుకాడబోమని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్
స్పష్టం చేశారు. సోమవారం వ్యాపార, పారిశ్రామిక సంఘం సీఐఐ నిర్వహించిన కార్యక్రమంలో దేశీయ పరిశ్రమనుద్దేశించి దాస్ మాట్లాడుతూ దేశ ఆర్థిక పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నామని తెలిపారు.
మౌలిక రంగాన్ని బలోపేతం చేయడం ద్వారా కరోనా వైరస్‌తో స్తంభించిన దేశ ఆర్థిక వ్యవస్థను తిరిగి పునరుద్ధరించవచ్చని ఈ సందర్భంగా భరోసా వ్యక్తం చేశారు. భారతీయ మౌలికరంగంలోకి మరిన్ని పెట్టుబడులు వచ్చేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే మౌలికాభివృద్ధికి భారీ ఎత్తున పెట్టుబడులు అవసరమన్న పేర్కొంటూ దీనికి ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలు చాలా కీలకమని చెప్పారు.
మెగా ప్రాజెక్టులు పూర్తయితే ఆర్థిక వ్యవస్థ మళ్లీ గాడిన పడగలదన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. వ్యవసాయ రంగంలో ఇటీవలి సంస్కరణలు కొత్త అవకాశాలకు తెర లేపాయని గుర్తు చేస్తూ భారత ఆర్థిక వ్యవస్థ ప్రగతికి ఇవి ప్రధానం కాగలవని విశ్వాసం వ్యక్తం చేశారు. అలాగే భారత్‌లో అంతర్జాతీయ ఉత్పాదక సంస్థల భాగస్వామ్యం 1 శాతం పెరిగినా దేశ తలసరి ఆదాయం 1 శాతానికిపైగా పెరుగగలదని చెప్పారు.
అమెరికా, యూరోపియన్ యూనియన్, బ్రిటన్‌లతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను త్వరగా పూర్తి చేసుకోవాలని చెబుతూ వ్యూహాత్మక వాణిజ్య విధానంతో ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఇక డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ కదలికలను చాలా దగ్గరగా గమనిస్తున్నామని స్పష్టం చేశారు.
కార్పొరేట్ బాండ్ల జారీ ఈ ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో లక్ష కోట్ల రూపాయలను తాకిందన్న ఆయన కరోనా నేపథ్యంలో మొండి బకాయిల విషయంలో జాగ్రత్తగా ఉండాలని, మూలధన సమీకరణపై దృష్టి పెట్టాలని బ్యాంకులకు సూచించారు. కాగా, దేశీయ గనుల రంగం జీడీపీ ప్రగతికి ఎంతగానో దోహదపడగలదని నీతి ఆయోగ్‌కు సూచించినట్లు సీఐఐ తెలియజేసింది.
More Stories
సవాళ్ల సుడిగుండంలో ప్రపంచ ఆర్థికాభివృద్ధి
రూ.2వేల కోట్ల భారీ ట్రేడింగ్ కుంభకోణంలో అస్సాం నటి అరెస్ట్
గౌతం అదానీ కంపెనీకి కెన్యాలో ఎదురుదెబ్బ